దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది: సీపీఐ

26 Sep, 2019 16:32 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. కశ్మీర్‌ విషయంలో ప్రధాని ఎమర్జెన్సీని తలపించేలా ప్రవర్తించారని, దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని విమర్శించారు. దేశంలోని ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. ఆర్థికమాంద్యంతో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు జరగడం లేదని, కార్మికుల హక్కులపై కేంద్రం దాడి చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 24న కోల్‌ ఇండియా కార్మికులు ఎనిమిది లక్షలమంది సమ్మె నిర్వహించారని గుర్తు చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ అమలు కాకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దివాలాకోరు విధానాలను నిరసిస్తూ అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి మాసాంతం వరకు బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోర వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దుబారా ఖర్చులను తగ్గించి ఉత్పత్తి రంగాలపై దృష్టి పెట్టాలని సీపీఐ కోరుతుందని అన్నారు. విష జ్వరాలపై ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానం మారాలని, లేకుంటే తెలంగాణ ఉద్యమం లాగే మరో ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా