బీరాలు పోతున్న టీడీపీ నాయకులు! | Sakshi
Sakshi News home page

మేకపోతు గాంభీర్యం

Published Sun, Apr 14 2019 9:36 AM

Chandrababu anxiety with Fear OF Defeat - Sakshi

సాక్షి, అమరావతి : పోలింగ్‌ సరళిని బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాను జోరు ఉధృతంగా ఉన్నట్లు స్పష్టమవుతుండటంతో గెలుపు ఆశలు వదిలేసుకున్న టీడీపీ నేతలు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు 130 సీట్లు వస్తాయంటూ టీడీపీ నేతలు క్యాడర్‌కు సర్ది చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ తమకు మాత్రమే చేతనవుతుందని చెప్పుకునే పోల్‌ మేనేజ్‌మెంట్‌లో విఫలమవడం, చంద్రబాబు వ్యూహాలన్నీ అడ్డం తిరగడంతోపాటు వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలనే నినాదం హోరుగాలిలా మారిన తీరు వారికి మింగుడుపడడం లేదు. కళ్లెదుటే ఓటమి సంకేతాలు స్పష్టంగా గోచరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక తీవ్రంగా మధనపడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ కలుసుకున్నా ఇవే అంశాలపై చర్చించుకుంటున్నారు. పరస్పరం ఫోన్లు చేసుకుంటూ తమ ఎమ్మెల్యే అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ తప్పులు జరిగాయి? అనే వాటిపై విశ్లేషించుకుంటున్నారు. ఓటమి ఖాయమని తెలియడంతో పస లేని వాదనలను తెరపైకి తెచ్చి సర్ది చెప్పుకుంటున్నారు.  

బాబు తీరుతో నేతల్లో నిస్పృహ  
ఇప్పటికే టీడీపీ గెలుపుపై ఆశలు వదిలేసుకున్న ఆ పార్టీ క్యాడర్‌ చంద్రబాబు తీరుతో తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోతోంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలపై అర్థంలేని ఆరోపణలతో రచ్చకెక్కడం ఓటమిని అంగీకరించినట్లేనని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తమ అధినేత అనవసరంగా ఎన్నికల సంఘాన్ని టార్గెట్‌ చేయడంతోపాటు మోదీ, జగన్, కేసీఆర్‌లకు ముడిపెట్టి అదేపనిగా ఆరోపణలు చేయడం వల్ల జనంలో మరింత పలుచనవుతున్నామని సీనియర్‌ నేతలు చర్చించుకుంటున్నారు. ఫలితాల కోసం వేచి చూసి ఓటర్ల తీర్పును హుందాగా అంగీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ తీరునే తప్పుబట్టడం, ఎన్నికలను ఒక ఫార్సుగా విమర్శించడం, ఎన్నికల కమిషన్‌ పనికిమాలినదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదనే భావన సాధారణ ప్రజల్లోనూ వ్యక్తమవుతోందని పార్టీ నేతలు వాపోతున్నారు. ఒకవైపు తామే గెలుస్తామని చెబుతూ, మరోవైపు ఎన్నికలు ఫార్సని విమర్శించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తరచూ ప్రజాస్వామ్య విలువల గురించి ప్రస్తావిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని తీవ్ర స్థాయిలో నిందించడం, ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్టుగా అభివర్ణించడం లాంటి చర్యల ద్వారా చంద్రబాబు పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నారనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement