Sakshi News home page

అండగా ఉంటామని చెప్పండి..అప్పుడే నాకు ధైర్యం వస్తుంది

Published Sat, Nov 24 2018 4:28 AM

Chandrababu comments on Pawan Kalyan and BJP - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కులం, పార్టీ, మతం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని, ప్రజలంతా అండగా ఉండాలని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. అప్పుడే ధైర్యం వస్తుందని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన మొత్తం ఓ సెల్‌ఫోన్‌లో చేస్తానని చెప్పారు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పుట్టపర్తికి వచ్చారు. తొలిరోజు శుక్రవారం సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆపై కప్పలబండలో జరిగిన గ్రామదర్శినిలో పాల్గొన్నారు. తర్వాత మారాల రిజర్వాయర్‌లో కృష్ణా జలాలకు జలహారతి పట్టి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ‘మీ ఇంటికి ఫైబర్‌గ్రిడ్‌ ఇస్తాం. టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటాం. ఇన్ని చేస్తున్న మాకూ, మా ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి.. ఉంటామని చెప్పండి. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీల పేరుతో కొందరు మభ్యపెడుతున్నారు. దానికి లోనైతే నష్టపోతాం. కులం, పార్టీ, మతం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాను. మీరంతా మాకు అండగా ఉంటానని చప్పట్లు కొట్టి ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ధైర్యం వస్తుంది. భవిష్యత్తులోనూ మీరు మాకు అండగా ఉండాలి. ఓడిసి, అమడగూరు, నల్లమాడ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కావాలన్నారు. నేను పనులు చేసిన తర్వాత మీ అభిమానం పెరగాలి. పెరుగుతుందా? లేదా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

అన్ని విధాలా బీజేపీ విఫలం
‘కేంద్రంలో బీజేపీ అన్ని విధాలా విఫలమైంది. ఏపీకి అన్యాయం చేసింది. అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు సీబీఐని ప్రయోగిస్తున్నారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసింది. మోదీ ప్రభుత్వం వల్ల ఏపీకి ఒక్క రూపాయి మేలు కూడా జరగలేదు. నోట్ల రద్దుతో మన డబ్బుల కోసం మనమే బ్యాంకుల ముందు నిలిచేలా చేశారు. జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. రూపాయి విలువ క్షీణించింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. రైతులు కుదేలయ్యారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగింది. సీబీఐ డిప్యూటీ డైరెక్టర్‌ ఒకరు ప్రధానమంత్రి కార్యాలయం తప్పుడు పనులు చేస్తోందని కోర్టుకు వెళ్లారు. దీనికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. ఎన్‌డీఏ ప్రభుత్వానికి అసహనం పెరగడంతో సీబీఐ, ఐటీ, ఈడీని ఏపీపై ప్రయోగించి ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు’ అని చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు.

పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడైనా కనిపించారా?
‘అనంతపురాన్ని ఆదుకుంటానన్న పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడైనా కనిపించారా? పవన్, జగన్‌ బీజేపీకి సహకరిస్తున్నారు. తెలుగు జాతి ప్రయోజనాలు, ప్రజల కోసమే 40 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాం. నా స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలవలేదు. దేశ ప్రయోజనాల కోసమే ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నా. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. బీజేపీ, ఎన్‌డీఏ చేసే తప్పుడు పనులను అంతా ఖండించాలి. రాబోయే రోజుల్లో అందరం అప్రమత్తంగా ఉండాలి’ అని చంద్రబాబు అన్నారు.

Advertisement
Advertisement