అందుకే ప్రభుత్వ నిధులిస్తున్నా | Sakshi
Sakshi News home page

అందుకే ప్రభుత్వ నిధులిస్తున్నా

Published Sat, Apr 6 2019 4:57 AM

Chandrababu Comments in Visakha roadshow - Sakshi

సాక్షి, విశాఖపట్నం/ నందికొట్కూరు/ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు): ఎన్నికల్లో ఖర్చు చేద్దామంటే తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్నారని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమవాళ్లు పది రూపాయలు ఖర్చు పెట్టాలని చూస్తుంటే ఐటీ అధికారులొచ్చి కార్యకర్తలకు ఐదు రూపాయలు కూడా ఖర్చుపెట్టనీయకుండా చేస్తున్నారని, అందుకే ఒకటే ఆలోచించి ప్రభుత్వ నిధులు ఇస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుభ్రంగా ఒక్క పైసా కూడా తాను ఇవ్వకుండా ప్రభుత్వపరంగా పింఛన్లకు రూ.2 వేలు ఇచ్చానని, రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు ఇచ్చానని, పసుపు–కుంకుమ కింద రూ.4 వేలు ఇచ్చానని, రైతులకు ఇవ్వాల్సిన రుణ బకాయిలు రూ.8 వేల కోట్లు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇన్ని వేల కోట్లు ఇస్తున్నప్పుడు.. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు నాకు కాకుండా ఇంకెవరికి ఓట్లు వేస్తారు తమ్ముళ్లూ అంటూ ప్రశ్నించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం విశాఖ నగర పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఎన్‌ఏడీ జంక్షన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల సమయంలో మాపై సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తారా? ఇది తెలుగుదేశంమీద దాడులు చేయడం కాదా? రాష్ట్రం మీద దాడులు చేయడం కాదా? నామీద దాడులు చేయడం కాదా? ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేయొచ్చునా? ఎక్కడైనా జరిగిందా? ఎవరిచ్చారు మీకీ అధికారం? అధికారముందని ఇష్టమొచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈడీ, ఇన్‌కంటాక్స్, సీబీఐలతో దాడులు చేస్తున్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు’’ అంటూ చంద్రబాబు వాపోయారు. అయితే సీబీఐ, ఐటీ దాడులకు తాము భయపడబోమన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్, జగన్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

మళ్లీ వస్తే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్లు: టీడీపీకి మరోసారి అధికారం ఇస్తే వంశధార–నాగావళి నదులను అనుసంధానిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఇస్తామన్నారు. విశాఖ నుంచి కబ్జాకోరులను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం శుక్రవారం కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆలూరు సభల్లోనూ ప్రసంగించారు. ఇదిలా ఉండగా, జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని రామవరప్పాడు వద్ద ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి సీఎం చంద్రబాబు శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఆక్షేపించారు. 

Advertisement
Advertisement