40 స్థానాలపై మీమాంస! | Sakshi
Sakshi News home page

40 స్థానాలపై మీమాంస!

Published Tue, Mar 5 2019 3:40 AM

Chandrababu completed reviews on constituencies within 7 districts - Sakshi

సాక్షి, అమరావతి: వరుస సమీక్షలు, కసరత్తుల తర్వాత కూడా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది. ఆశావహులతో అర్థరాత్రిళ్లు ప్రత్యేక భేటీలు నిర్వహిస్తూ సర్వేలు, సమీకరణలు బేరీజు వేస్తున్నా ఎటూ తేల్చలేకపోతున్నారు. గత 15 రోజుల్లో ఏడు జిల్లాల్లోని 14 పార్లమెంటు స్థానాలు, 98 అసెంబ్లీ స్థానాలపై ఆయన సమీక్షించారు. అయినా అందులో 40 మందికి పైగా అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరారైనట్లు చెబుతున్న అభ్యర్థుల జాతకాలు సైతం ఏ నిమిషంలోనైనా మారిపోవచ్చని, బీ–ఫారాలు చేతికి అందే వరకూ ఎవరికీ గ్యారంటీ లేదనే గుసగుసలు అధికారపార్టీలో వినిపిస్తున్నాయి. స్పష్టత రాకపోవడానికి డబ్బు, కుల సమీకరణలే కారణమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబడుతుండడంతో చాలా చోట్ల ప్రాధామ్యాలు మారిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. లోకేశ్‌ ఆశీస్సులున్న వారినే చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటుండడం, అదేమంటే సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతుండడంతో పార్టీ నేతలు కంగుతినాల్సి వస్తోంది.

రాజధాని పరిధిలోని సీట్లపై సస్పెన్స్‌
రాజధాని ప్రాంతంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరు, తెనాలికి మాత్రమే ఖరారు చేశారు.  గుంటూరు పశ్చిమ, తాడికొండ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌కు ఎసరు పెట్టారు. బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో పర్చూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పరిస్థితీ డోలాయమానంలో ఉంది. వేమూరు, రేపల్లె, అద్దంకి స్థానాలను సిట్టింగ్‌లైన నక్కా ఆనంద్‌బాబు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌కు ఖరారు చేశారు.  కనిగిరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు రెడ్‌సిగ్నల్‌ ఇచ్చి కాంగ్రెస్‌ నుంచి ఉగ్రనరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకుని ఇద్దరి మధ్య పోటీ పెట్టడం గమనార్హం. ఎర్రగొండపాలెం, మార్కాపురం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఆత్మకూరు, కోవూరు స్థానాలను సస్పెన్స్‌లో ఉంచారు. కావలిలో బీద మస్తాన్‌రావును పనిచేసుకోమని చెప్పినా అవసరమైతే ఎంపీగా పోటీ చేయాలనే హింట్‌ ఇచ్చారు. ఉదయగిరిలో బొల్లినేని రామారావుకు స్పష్టంగా సీటు ఇస్తానని చెప్పలేదని సమాచారం. నెల్లూరు అర్బన్‌ సీటును మంత్రి నారాయణ, నెల్లూరు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కందుకూరు పోతుల రామారావు, సర్వేపల్లికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మాత్రమే సీట్లు ఓకే చేశారు. 

రాయలసీమలో భారీగా పెండింగ్‌ జాబితా
రాయలసీమలోనూ చాలా సీట్లపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఆదోని, కర్నూలు, కోడుమూరు, ఆలూరు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. నంద్యాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని సస్పెన్స్‌లో పెట్టారు. వైఎస్సార్‌ జిల్లాలో కడప, బద్వేలు, ప్రొద్దుటూరు అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచారు. రాజంపేట పార్లమెంటు స్థానం పరిధిలోని తంబళ్లపల్లిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు గ్యారంటీ ఇవ్వలేదు. మదనపల్లి, రైల్వే కోడూరు స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. ఏలూరు పార్లమెంటు స్థానం పరిధిలో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పనిచేసుకోవాలని చెప్పగా నూజివీడు, కైకలూరు స్థానాలపై సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానం పరిధిలో తాడేపల్లిగూడెంలో అభ్యర్థిని ఖరారు చేయలేదు. రాజమండ్రి పార్లమెంటు స్థానం పరిధిలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అభ్యర్థులను ఖరారు చేయలేదు. కొవ్వూరులో మంత్రి కేఎస్‌ జవహర్‌కు ఉద్వాసన తప్పేలా కనిపించడంలేదు. అనపర్తి సీటుపైనా పూర్తిస్థాయి స్పష్టత రాలేదని చెబుతున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలో పత్తిపాడు అభ్యర్థిని ఖరారు చేయలేదు. విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో తిరువూరు, విజయవాడ పశ్చిమ స్థానాలపై సందిగ్దత కొనసాగుతోంది. మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో పెడన, గుడివాడ, పామర్రు స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. 

14 ఎంపీ స్థానాలకు పది స్థానాలకు అభ్యర్థులు లేరు 
సమీక్ష పూర్తయిన 14 ఎంపీ స్థానాలకుగానూ పది స్థానాల్లో అభ్యర్థులెవరో తెలియని పరిస్థితి నెలకొంది. రాజంపేట, కర్నూలు, నంద్యాల, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. ఆర్థికంగా బలమైన వారి కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారని, ఆర్థిక వ్యవహారాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాయని అందుకే పోటీ లేని సీట్లను కూడా ఖరారు చేయడంలేదని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. 

Advertisement
Advertisement