బాబు గారడి | Sakshi
Sakshi News home page

బాబు గారడి

Published Fri, Mar 29 2019 12:37 PM

Chandrababu Naidu Target to Discontent Leaders - Sakshi

ఎన్నికలు రావడంతో చంద్రబాబు మరోసారి తన పబ్బం గడుపుకు నేందుకు అసంతృప్తులకు అలవిగాని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చినట్టుగానే నాయకులకూ వాగ్దానాలు చేస్తున్నారు. ఇలా ఒకే పదవిని ఒకరికి తెలియకుండా ఒకరికి.. ఇలా ముగ్గురు, నలుగురికి హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో వారందరినీ ఉపయోగించుకునేందుకు వల వేస్తున్నారు. చంద్రబాబు హామీలు నీటి మూటలేనని తెలిసినా కొందరు నాయకులు     ఏం చెయ్యాలో దిక్కుతోచక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

సాక్షి, తిరుపతి: జిల్లా టీడీపీలో అనేకమంది ముఖ్య నాయకులు టికెట్లు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకోసం మొదటి నుంచి కష్టపడుతున్నా.. గుర్తింపు లభించడం లేదు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెట్టారు. గతంలో తొమ్మిదేళ్లు, ప్రస్తుతం ఐదేళ్లు పార్టీ అధికారంలో ఉన్నా.. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చెయ్యలేదని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మొదటి నుంచి పదవులు అనుభవించిన వారికే చంద్రబాబు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. పార్టీకోసం పనిచేస్తున్నా.. అధినేత పదవులు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేవు. దీంతో ఈసారి పలువురు నాయకులు ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  ప్రస్తుతం టీడీపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకుల అవసరం తప్పనిసరైంది. దీంతో ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడడం. కొందరితో ఫోన్లలో మాట్లాడడం.. మరి కొందరిని నేరుగా కలిసి బుజ్జగిస్తున్నారు.

అందరికీ హామీలు
తిరుపతి అసెంబ్లీ టికెట్‌కోసంతుడా చైర్మన్‌ నరసింహయాదవ్, టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పులిగోరు మురళి, నీలం బాలాజి, ఊకా విజయకుమార్, డాక్టర్లు సిపాయి సుబ్రమణ్యం, సుధారాణి, ఆశాలత, శ్రీహరిరావు, కోడూరు బాలసుబ్రణ్యం ప్రయత్నాలు చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చే కందాటి శంకర్‌రెడ్డి, మబ్బు దేవనారాయణరెడ్డి కూడా టికెట్‌ ఆశించారు. అయితే వారెవరినీ కాదని మంత్రి నారాయణ చెప్పిన సుగుణమ్మకే మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో టికెట్‌ ఆశించిన వారందరూ తీవ్ర అసంతృప్తితో దూరంగా ఉండిపోయారు. వారందరిపైనా సుగుణమ్మ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన చంద్రబాబు టీటీడీ చైర్మన్, తుడా∙చైర్మన్, మేయర్, ఎమ్మెల్సీ, టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇవన్నీ ఒకరికి తెలియకుండా ఒకరికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ, పలమనేరు టీడీపీ నేత సుభాష్‌చంద్రబోస్, పుంగనూరుకు చెందిన వెంకటరమణరాజు, మదనపల్లెకు  చెందిన గంగారపు రాందాసుచౌదరి, నగరికి చెందిన అశోక్‌రాజు, మరి కొందరు నాయకులు అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. వీరందరూ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

ఒకరికి తెలియకుండా ఒకరికి హామీలు
టికెట్‌ రాలేదని కొందరు, ఐదేళ్లు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని మరి కొందరు, నామినేటెడ్‌ పదవులు ఇవ్వలేదని ఇంకొందరు తీవ్ర అసంతృప్తితో పార్టీ వ్యవహారా లకు దూరమయ్యారు. టీటీడీ పాలకమండలి, తుడా∙చైర్మన్‌ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నా.. రెండేళ్లుగా భర్తీ చేయకుండా ఉంచేశారు. ఆ రెండేళ్లు ఎవరికో ఒకరికి ఇచ్చి ఉంటే కొంత మందికైనా న్యాయం జరిగేది. అటూ ఇటూ కాకుండా ఉంచడంపై తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలతో కొందరు పార్టీ మారే ప్రయత్నాల్లో పడ్డారు. దీంతో కంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగారు. కొందరిని అమరావతికి పిలిపించుకున్నారు. మరి కొందరితో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన సమయంలో ఇంకొందరిని నేరుగా పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరికి టీటీడీ చైర్మన్, ముగ్గురికి ఎమ్మెల్సీలు, మరో ఇద్దరికి తుడా చైర్మన్, డీసీసీబీ, టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పదవులతో పాటు బోర్డు సభ్యుల పదవి ‘నీకే. నీకే’ అంటూ ఎవరికి వారికి చెప్పి ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ పదవులు జిల్లాలో ముగ్గురికి హామీ ఇచ్చారు. తిరుపతికి చెందిన ముగ్గురు నాయకులకు తుడా∙చైర్మన్‌ పదవి ఇస్తామని మాట ఇచ్చినట్లు తెలిసింది. చిత్తూరు, తిరుపతి మేయర్‌ పదవులు నలుగురికి హామీలు ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు ఒకరికి తెలియకుండా.. ఒకరికి హామీలు ఇచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు.. ‘నిను నమ్మం బాబు’ అంటుండడం గమనార్హం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement