బాబు తోడు.. నిన్ను నమ్మలేం! | Sakshi
Sakshi News home page

బాబు తోడు.. నిన్ను నమ్మలేం!

Published Mon, Apr 1 2019 12:47 PM

Chandrababu Naidu Target to Party Leaders in Chittoor - Sakshi

నిన్నమొన్నటి వరకు వారు టీడీపీలో కీలకంగా ఉన్నారు. కార్యకర్తలు, ప్రజలకు సేవచేసి అధినేత మెప్పు పొందారు. మరింత సేవ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. పార్టీని తమ భుజాలపై మోసినా ప్రయోజనం లేదని తీవ్ర అసహనానికి లోనయ్యారు. కార్యకర్తలకు, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థులకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకూ అంటీముట్టనట్టుగా జారుకున్నారు. దీన్ని గ్రహించిన బాబు బుజ్జగించే పనిలో సక్సెస్‌ సాధించారు. అప్పటినుంచి పార్టీకి అహర్నిశలు కృషిచేస్తున్నారు. కానీ వీరిని బాబు నమ్మడం లేదు. వీరి కదలికలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అభ్యర్థులు కూడా వారిపై రోజూ అధినేతకు ఫిర్యాదులు పంపుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సాక్షి, తిరుపతి: టీడీపీలో అసంతృప్తి నేతలపై అధినేత చంద్రబాబు నిఘా పెట్టారు. నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీకోసం పనిచేస్తున్నారా? లేదా? అనే అనుమానంతో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసి రంగంలోకి దించినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి, చిత్తూరు, నగరి నియోజకవర్గాల్లో 18 మంది టీడీపీ అసంతృప్తి నాయకుల కదలికలను కనిపెడుతున్నారు. వీరితో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా ఓ కన్నేశారు. తిరుపతిలో తుడ చైర్మన్‌ నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే మోహన్, నీలం బాలజీ, డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్‌ ఆశాలత టీడీపీ తరఫున టికెట్‌ ఆశించి భంగపడ్డారు. చిత్తూరు టికెట్‌ మళ్లీ తనకే ఇవ్వాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే సత్యప్రభ ఆశించారు. ఇంకా మేయర్‌ కఠారి హేమలత భర్త ప్రవీణ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి భర్త చంద్రప్రకాష్, కాజూరు బాలాజీ, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నం చేశారు.  నగరి అసెంబ్లీ టికెట్‌ కోసం ఎమ్మెల్సీ గాలి సరస్వతి, గాలి జగదీష్‌తో పాటుఅశోక్‌రాజు, పాకా రాజా టికెట్‌ ఆశించారు. వీరంతా ఎవరి దారిలో వారు ప్రయత్నించారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు, వారి బంధువులు, స్నేహితుల ద్వారా సిఫారసులు చెయ్యించి విఫలమయ్యారు. అమరావతిలోనే తిష్టవేసి ప్రయత్నాలు చేశారు. తమ సామాజిక వర్గాల వారిని తీసుకెళ్లి చంద్రబాబుపై ఒత్తిడి చేయించారు. ప్రయోజనం లేకపోవడంతో అసంతృప్తితో వెనుదిరిగారు. వీరిలో కొందరు దూరంగా ఉంటే.. మరి కొందరు పార్టీకోసం పనిచేస్తున్నారు.

అధినేతకు అభ్యర్థుల ఫిర్యాదు
అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశాక ప్రచారం ప్రారంభించారు. ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాల్లో అసంతృప్తి నాయకులు కూడా ఉన్నారు. అయితే వారు పూర్తిస్థాయిలో ప్రచారం చెయ్యడం లేదని, కొందరు తటస్తంగా ఉన్నారని ఆయా అసెంబ్లీ అభ్యర్థులు చంద్రబాబుకు తెలియజేశారు. మరికొందరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నియోజకవర్గానికో బృందం
అభ్యర్థుల ఫిర్యాదుతో చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికీ ఆరుగురు వ్యక్తులను ఒక బృందంగా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన వీరు తిరుపతి, చిత్తూరు, నగరి నియోజకవర్గాలకు చేరుకుని అసంతృప్తి నాయకులపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఆయా ప్రాంతాలకు చేరుకున్న బృందం సభ్యులు అసంతృప్తి నాయకులు నివాసాలు, బంధువులు, స్నేహితుల కదలికలపై దృష్టి సారించారు. అభ్యర్థులతో కలసి ప్రచారం చేస్తున్న వారు, విడివిడిగా ప్రచారం చేస్తున్న వారి కదలికలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. పార్టీ బృందాలతో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా ఓ కన్నేశారు. అసంతృప్తి నేతల బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించి నగదు లావాదేవీలపైనా నిఘా బృందాలు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఓ టీడీపీ నాయకుడిని ‘సాక్షి’ సంప్రదిస్తే.. ‘‘ఎటువంటి పదవులు ఆశించకుండా ఇన్నాళ్లు పార్టీకోసం కష్టపడి పనిచేశాం. టికెట్‌ రాకపోయినా అభ్యర్థుల కోసం తిరుగుతున్నాం. మమ్మల్నే అనుమానిస్తారా? మాపై ఫిర్యాదు చేస్తారా? ఎన్నికలు వచ్చినప్పుడే మేం కనిపిస్తాం. ఆ తరువాత మా పార్టీ పెద్దలు చులకనగా చూస్తారు. మమ్మల్ని దొంగలను చూసినట్టు చూడడం దారుణం’’ అంటూ టీడీపీ అధినేతపై, అభ్యర్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement