Sakshi News home page

ఏపీ ఇంటెలిజెన్స్‌ ‘చిచ్చు’బుడ్లు

Published Wed, Nov 7 2018 1:56 AM

Chandrababu Naidu Target TRS Rebels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ ‘చిచ్చు’బుడ్లు పేలనున్నాయి! అధికార టీఆర్‌ఎస్‌ విజయానికి గండి కొట్టేలా ‘అసంతృప్త రాకెట్లు’ఎగరనున్నాయి!! తెలంగాణపై పట్టు కోసం గులాబీ దళాన్ని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి వదవి వచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కంటే ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతూ అందుకు అవసరమైన మార్గాల కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా ఎన్నికలకు అవసరమైన పూర్తి ఖర్చును భరించేందుకు సిద్ధమైన చంద్రబాబు... ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఓట్లను చీల్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన బినామీ మీడియా అధిపతి ద్వారా ఈ వ్యూహాల అమలుకు ఓ యంత్రాంగాన్నే ఆయన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు బాగా తెలిసిన జర్నలిస్టులతోపాటు ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌లోని బలమైన నేతలను గుర్తించేందుకు టీడీపీ సీనియర్‌ కార్యకర్తలను ఉపయోగించుకుంటూ ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది. ఈ సైన్యంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మీడియా గ్రూపుల ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. వారికి అండగా ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలు మినహాయించి 112 నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చే వ్యూహానికి టీడీపీ తెరలేపిందని తెలుస్తోంది.

పోటీకి ఒప్పుకుంటే భారీ ఆఫర్‌...
టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాలేదన్న అసంతృప్తి, ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఉన్న నేతలను గుర్తించే బాధ్యతను టీడీపీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యంలోని సభ్యులు చేపట్టనున్నట్లు తెలియవచ్చింది. టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురేసి చొప్పున బలమైన నేతలను గుర్తించి వారిలోంచి కనీసం 10 వేల ఓట్లు చీల్చగల సామర్థ్యమున్న ఒక్కో నేతను పోటీ చేయడానికి ఒప్పించేలా ఆ సభ్యులు పనిచేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను సైన్యంలోని సభ్యులకు తొలి దశలో రూ. 25 వేల చొప్పున, ఆయా అభ్యర్థులను పోటీకి ఒప్పించాక మరో రూ. 75 వేల చొప్పున పారితోషకం ముట్టనుందని తెలుస్తోంది. అలాగే పోటీ చేయడానికి ముందుకు వచ్చే ఒక్కో అభ్యర్థికి వారి స్థాయిని బట్టి రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధంగా ఉంది. కనీసం 10 వేల ఓట్లు చీల్చగలిగితే టీఆర్‌ఎస్‌ అధికార అభ్యర్థి ఓడిపోతాడన్నది చంద్రబాబు ఆశ. ఈ రకంగా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయవచ్చన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దీని కోసంచంద్రబాబుకు సన్నిహితుడైన మీడియా అధిపతి తన నెట్‌వర్క్‌ ద్వారా ఇప్పటికే కొన్ని పేర్లు సేకరించి చంద్రబాబుకు అందజేశారని తెలియవచ్చింది.

ఎందుకీ పట్టుదల...?
తెలంగాణలో ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉండటం వెనుక అసలు కారణం ఓటుకు కోట్లు కేసేనన్నది బహిరంగ రహస్యం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే వెనువెంటనే ఓటుకు కోట్లు కేసుపై విచారణ ప్రారంభిస్తారన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసును విచారించాలన్న నిర్ణయం తీసుకొని ఉంటారని టీడీపీ ఆందోళన చెందుతోంది. ఈ కేసులో చంద్రబాబును విచారిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తెలుగుదేశం పార్టీ అధినేత ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి లక్ష్యంగా పావులు కదుతుపుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement