Sakshi News home page

దూకుడుగా.. దన్నుగా..

Published Mon, Dec 25 2017 3:02 AM

Changes in state politics in 2017 - Sakshi

రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఏడాది పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆందోళనలు, ధర్నాలతో దూకుడు పెంచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. సంస్థాగతంగా బలోపేతమవడంపైనా దృష్టి సారించింది. ఇక ఏడాది పొడవునా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన మజ్లిస్‌ (ఎంఐఎం).. జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ మెరిసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో పలు స్థానాలు కైవసం చేసుకుంది. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ పేరుతో ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టీఆర్‌ఎస్‌కు దూరమైన ఉద్యమ శక్తులను కూడగట్టుకొని ప్రభుత్వంపై పోరాటాలకు దిగుతోంది. – సాక్షి, హైదరాబాద్‌

చెక్కు చెదరని అభిమానం.. వైఎస్సార్‌ సీపీ 
ఆందోళనలు.. ధర్నాలు.. రాస్తారోకోలతో రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ఈ ఏడాది దూకుడుగా వ్యవహరించింది. సంక్షేమ పథకాల అమలులో అలసత్వం, నిధుల కొరత, రైతాంగ సమస్యలు, ప్రజావ్యతిరేక విధానాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ ఫీజు పోరు ద్వారా ఆందోళనలు చేసింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన రాస్తారోకోతో ప్రజా సమస్యల తీవ్రతను సర్కారు దృష్టికి తీసుకెళ్లడంలో విజయవంతమైంది.

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగంపైనా పార్టీ ధ్వజమెత్తింది. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూనే.. సంస్థాగతంగా బలం పెంచుకోవడంపై వైఎస్సార్‌ సీపీ దృష్టి సారించింది. హైదరాబాద్‌లో తెలంగాణ పార్టీ ప్లీనరీ నిర్వహించింది. అంతకుముందు 280 మండలాల్లో కమిటీలు నియమించింది. 500 మండలాల్లో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపట్టి పార్టీ ఉనికి చాటింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ప్లీనరీకి హాజరుకాలేని పరిస్థితుల్లోనూ పార్టీ తెలంగాణ అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో ప్లీనరీ విజయవంతంగా నిర్వహించింది. నాయకులు, కార్యకర్తల్లో వైఎస్సార్‌పై చెదరని అభిమానం ఉందని ప్లీనరీ స్పష్టం చేసింది.  


కొత్త గొంతుక తెలంగాణ ఇంటి పార్టీ
తెలంగాణలో ఈ ఏడాది కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్‌ చెరుకు సుధాకర్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టీఆర్‌ఎస్, ఇతర సంఘాలకు దూరమైన ఉద్యమ శక్తులను కూడగట్టి ప్రభుత్వంపై పోరాటాలకు పిలుపునిచ్చింది.

సామాజికాంశాలు, ప్రజాసమస్యలపై ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ.. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తోంది. సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు అనుబంధ సంఘాలు, మండల కమీటీలను ఏర్పాటు చేసింది. ధర్నాలు, దీక్షలతో ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచుకునేందుకు కృషి చేస్తోంది.


ప్రభుత్వానికి చేదోడు వాదోడు – ఎంఐఎం
ఈ ఏడాది పొడవునా వివిధ అంశాల్లో ప్రభుత్వానికి ఎంఐఎం వెన్నుదన్నుగా నిలిచింది. సంస్థాగత కార్యక్రమాలు అంతగా లేకున్నా వివిధ అంశాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు వేదికగా టీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయి మిత్రపక్షంగా వ్యవహరించింది. మైనారిటీ సమస్యలపై ప్రభుత్వాన్ని కదలించి అనుకూల నిర్ణయాలు తీసుకునేలా సఫలమైంది.

జాతీయ స్థాయి రాజకీయాలపైనా ఎంఐఎం దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 38 సీట్లకు పోటీ చేసి పరాజయం పాలైనా 2 లక్షల మంది ఓటర్లను తమవైపు తిప్పుకోగలిగింది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి 29 స్థానాలు కైవసం చేసుకుంది. మహారాష్ట్రలోనూ మున్సిపల్‌ ఎన్నికల్లో పాల్గొని కొన్ని స్థానాలను కైవసం చేసుకొని.. తాజాగా కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టింది.

Advertisement
Advertisement