టీడీపీలో కలకలం

12 Jan, 2018 12:19 IST|Sakshi

మేయర్‌పై క్రిమినల్‌ కేసు

ప్రజాప్రతినిధులపై కేసులతో బజారున పడుతున్న పరువు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు నగర ప్రథమ పౌరుడిపై క్రిమినల్‌ కేసు నమోదు కావడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపింది. వ్యాపారంలో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు ఆదేశాలతో చెన్నై క్రైం బ్రాంచ్‌ పోలీసులు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఇతర రాష్ట్రాల్లో వరుసగా చీటింగ్, ఇతర కేసులు నమోదు కావటం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మేయర్‌ అజీజ్, కుటుంబ సభ్యులు స్టార్‌ ఆగ్రో మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో రొయ్యల ఎగుమతి వ్యాపారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట డేవీస్‌పేటలో ఈ కంపెనీ ఉంది. అమెరికా, ఇంగ్లండ్‌ దేశాల్లోనూ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

అజీజ్, అతని సోదరుడు, 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ అయిన జలీల్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు ఖుద్దూస్, భాను, షేక్‌ షర్మిల, భాగస్వామి డాక్టర్‌ కోనేరు అనిల్‌కుమార్‌ సదరు కంపెనీ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలో వాటా ఇస్తామంటూ తమతో రూ.42 కోట్లు పెట్టుబడులు పెట్టించి.. ఆ మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించి మోసం చేశారంటూ చెన్నైలోని టి.నగర్‌కు చెందిన ప్రసాద్‌ జెంపెక్స్‌ కంపెనీ నిర్వాహకుడు ఎ.మనోహరప్రసాద్‌ అక్కడి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 6న స్టార్‌ ఆగ్రో యాజమాన్యంపై చెన్నై సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పరువు తీస్తున్నారు
పార్టీ ముఖ్యులు వరుసగా వివిధ కేసుల్లో నిందితులు కావడం టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. తప్పుడు పనులు చేస్తూ పరువు తీస్తున్నారని పార్టీకి చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులపై రెండేళ్లుగా కేసులు నమోదవుతున్నాయి. అవన్నీ వ్యాపారపరమైన మోసాలు, ఇతర అంశాలకు సంబంధించిన కేసులు కావటం గమనార్హం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. అక్కడ విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన వేలాది కోట్ల రూపాయల విలువైన పనుల్లో కొన్ని బొల్లినేని రామారావు దక్కించుకున్నారు. అక్కడ చేసిన పనులన్నీ పూర్తి అవినీతిమయం కావటంతో దేశవ్యాపంగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్లినేనిపై అక్కడ వరుస కేసులు నమోదయ్యాయి. అలాగే సూళ్లూరుపేటకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలంగాణలోని బ్యాంకులకు భారీగా బకాయిపడటంతో కేసులు నమోదయ్యాయి. సీబీఐ కేసు కూడా ఆయనపై కొనసాగుతోంది. నకిలీ పత్రాలతో బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది తిరిగి చెల్లించటంలో విఫలంమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

నగరానికి దూరంగా..!
మేయర్‌ అజీజ్‌ రెండు రోజులుగా స్థానికంగా లేకపోవడం, కేసు నమోదు కావటం టీడీపీలో చర్చనీయాంశమైంది. మేయర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 52వ డివిజన్‌లో బుధవారం జన్మభూమి గ్రామసభ నిర్వహించగా.. ఆయన గైర్హాజరయ్యారు. శుక్రవారం జన్మభూమి ముగింపు సభలో పాల్గొనాల్సి ఉంది. నగరానికి వచ్చిన ఉప రాష్ట్రపతికి ప్రోటోకాల్‌ ప్రకారం నగర ప్రథమ పౌరుడి హోదాలో మేయర్‌ స్వాగతం పలకాల్సి ఉంది. ఈ కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా