రాజీనామాల యోచనలో కాంగ్రెస్‌? | Sakshi
Sakshi News home page

రాజీనామాల యోచనలో కాంగ్రెస్‌?

Published Wed, Mar 14 2018 3:27 AM

CLP meeting on future functionalities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఈ అంశంపై మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఇద్దరు సభ్యులకు మద్దతుగా రాజీనామాలు సమర్పిస్తే ఎలా ఉంటుంది? ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? అన్న కోణంలో చర్చ జరిగింది. కానీ ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

ముందు ఆ ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో స్పష్టమయ్యాక అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు వెళ్దామన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. మొత్తమ్మీద తమ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసే దిశలో కాంగ్రెస్‌ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. దీనిపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని, పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ.. ప్లీనరీ సమావేశాలకు వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించింది.

కుంతియాతో మంతనాలు
ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఇతర సభ్యులను సస్పెండ్‌ చేస్తూ అధికార పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ లాబీల్లోని సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తర్వాత సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, జానారెడ్డి మాట్లాడారు. సభ్యుల సలహాలను తీసుకున్న తర్వాత ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు అంశాన్ని.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. అధికార పక్షం అనుకున్నదే తడువుగా ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి గెంటేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ విషయాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏఐసీసీ ప్లీనరీలో దీనిపై చర్చించి.. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా తీర్మానాన్ని ఆమోదింపజేయాలని నిర్ణయించారు.

క్షేత్రస్థాయి ఆందోళనలు
పార్టీ కేడర్‌ను ఇదే అదనుగా సమాయత్తం చేసే కార్యాచరణను సీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్‌ కేడర్‌ ఆందోళనకు దిగింది. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం రసాభాసగా మారింది. 

Advertisement
Advertisement