వైఎస్సార్‌సీపీ ఎంపీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోటీ: సీఎం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోటీ: సీఎం

Published Mon, Jun 4 2018 2:06 AM

CM Chandrababu comments on By-election of YSRCP MP Seats - Sakshi

కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ పోటీచేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటిం చారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో నీరు ప్రగతి–ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అనే అంశంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. జొన్నగిరి చెరువుకు జలహారతి ఇచ్చి హంద్రీ–నీవా ప్రాజెక్టు నుంచి పత్తికొండ, ఆలూరు, డోన్‌ నియోజకవర్గాల్లోని 68 చెరువుల్లో నీటిని నింపే పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ నెల 5న వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పీకర్‌తో సమావేశమైన తరువాత రాజీనామాల ఆమోదంపై స్పష్టత వస్తుందన్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదింపజేసుకొని ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్‌ చేశారు. వారు ఉప ఎన్నికలు రాకుండా చేస్తారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పాత్రధారులు, సూత్రధారులను ఓడించి తమ కు 25 మంది ఎంపీలను ఇవ్వాలని ఆయన కోరారు. 

పోలవరానికి నిధులివ్వని బీజేపీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ నిధులు ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికి 55 శాతం పనులు పూర్తిచేశామని, 2019 డిసెంబర్‌లోపు మిగిలిన 45 శాతం పూర్తిచేస్తా మన్నారు. కాగా, 2019 ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని, అందులో టీడీపీ చక్రం తిప్పుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. తనపై అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పవన్‌కల్యాణ్‌కు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. ఉపాధి కూలీలు, రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ‘మీరు మళ్లీ నాకు ఓట్లు వేయాలి.. అందరికీ చెప్పి వేయించాలి’ అని చంద్రబాబు వారితో అనగా.. ‘మీకు కాకుండా మరెవరికి వేస్తాం సార్‌’ అంటూ కూలీలు, రైతులు బదులిచ్చారు. దీంతో సీఎం.. ‘మీరు అలానే అంటారు, పదేళ్లు పక్కన పెట్టారు.. మిమ్మల్ని నమ్మను’.. అంటూ తన అక్కసును వెళ్లగక్కారు.

జన్మభూమి కమిటీలపై ఫిర్యాదులు
ఆ తర్వాత జొన్నగిరిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీఎం పర్యటించారు. అక్కడ ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. తన కుమారుడికి రెండు కళ్లు లేకపోయినా జన్మభూమి కమిటీ సభ్యులు దరఖాస్తు తీసుకోవడంలేదని ఓ తల్లి.. అలాగే, తన పింఛన్‌ దరఖాస్తు కూడా తీసుకోవడంలేదని 80 ఏళ్ల వెంకటమ్మ ఫిర్యాదు చేయడంతో సీఎం ఖంగుతిన్నారు. కాగా, ముఖ్యమంత్రి కార్యక్రమానికి మంత్రి భూమా అఖిలప్రియ, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి గైర్హాజరయ్యారు.

Advertisement
Advertisement