బీజేపీకి భయపడం: బాబు | Sakshi
Sakshi News home page

బీజేపీకి భయపడం: బాబు

Published Wed, Jun 6 2018 2:39 AM

CM Chandrababu Comments on NDA Govt - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ‘నాలుగేళ్లు బీజేపీతో కలిసి పనిచేశాం. అడుగడుగునా అడ్డుపడ్డారు. ఏ మాత్రం సహకరించలేదు. భయపెడితే మేం భయపడే పరిస్థితుల్లో లేం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాదని చెప్పారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సంక్షేమం, సాధికారతపై నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘బీజేపీ గెలవదు. మేం చెప్పిన వారే ప్రధాని అవుతారు. మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పుతా. గుజరాత్‌ కంటే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే కేంద్రం సహకరించడం లేదు. బీజేపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల సమయంలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లి అడిగినా పట్టించుకోలేదు. నేను మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశా’ అని సీఎం తెలిపారు. 

కర్ణాటకలో అధికారం కోసం కుట్రలు
తాను ఇచ్చిన పిలుపు మేరకు కర్ణాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించారని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారం కోసం కుట్రలు చేశారని, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపించారు. మన రాష్ట్రంలో అలాంటి కుట్రలు సాగనివ్వబోమన్నారు. బీజేపీ, వైఎస్సార్‌ సీపీ కలసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ఐదో బడ్జెట్‌ చూశాక కేంద్రం నుంచి, ఎన్డీఏ నుంచి తప్పుకుని అవిశ్వాసం పెట్టామని చెప్పారు. బీజేపీతో విడిపోయిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తనపై, టీడీపీపై, పార్టీ ఎమ్మెల్యేలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  

దేశంలో మనమే నంబర్‌ వన్‌
‘కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధికి నేను కష్టపడుతున్నా. దేశ ఆర్థికాభివృద్ధి కన్నా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఎక్కువ. 10.5 శాతం ఆర్థిక వృద్ధి, వ్యవసాయంలో 15 శాతం వృద్ధి సాధించాం. పారిశ్రామిక  రంగం దెబ్బతింటోంది. అయినా కష్టపడి కొన్ని కంపెనీలు తెచ్చా. తిరుమల దేవాలయం పవిత్రతను మేం  కాపాడుతున్నాం. అక్కడ ఓ పంతులును పట్టుకుని దేవాలయంపై కేంద్రం కుట్రలు చేస్తోంది. బీజేపీ, వైఎస్సార్‌ సీపీ, జనసేన కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కాపులకు ఇచ్చిన హామీని అమలు చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి కళావెంకటరావు, నక్కా ఆనంద్‌బాబు, సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీలు తోట నరసింహం, పి.రవీంద్రబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

నీరు–ప్రగతిపై 52 శాతం మంది అసంతృప్తి
సాక్షి, అమరావతి: నీరు–ప్రగతి పనులపై ప్రజల్లో 48 శాతం సంతృప్తి వ్యక్తమైందని, 52 శాతం మందిలో అసంతృప్తి నెలకొదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం తన నివాసం నుంచి నవనిర్మాణ దీక్షపై సర్పంచులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ ‘రైతు రథం, పొలం పిలుస్తోంది’పై 56 శాతం సంతృప్తి ఉందన్నారు. మూడో రోజు దీక్షలో 17 లక్షల మంది పాల్గొన్నారని, 19 వేల శంకుస్థాపనలు జరిగాయన్నారు.

చంద్రబాబు మృత్యుంజయ హోమం
అమలాపురం టౌన్‌: సీఎం చంద్రబాబు మంగళవారం అమలాపురం రూరల్‌ మండలం రంగాపురంలోని రాజరాజేశ్వరి సమేత రామేశ్వరస్వామి ఆలయంలో సకృత మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. చంద్రబాబు  స్వయంగా హోమంలో పాల్గొని పూర్ణాహుతిలో ద్రవ్యాలను వేశారు. ఆలయ ప్రాంగణంలో కోనేరుకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. హోమం నిర్వహించిన 25 మంది వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదించారు. చంద్రబాబు శివాలయంలో దాదాపు అరగంట పాటు ఉన్నారు. రాజయోగం, మృత్యుంజయం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం చేసే ఈ అరుదైన హోమాన్ని చంద్రబాబుతో చేయించాలన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నం ఇన్నాళ్లకు ఫలించిందని పార్టీ నేతలు తెలిపారు.

Advertisement
Advertisement