టీడీపీ ఎంపీల వీడియోపై విచారణ | Sakshi
Sakshi News home page

ఆ వీడియో బయటకురావడంపై విచారణ

Published Sat, Jun 30 2018 3:43 AM

CM Chandrababu with TDP MPs about Viral Video - Sakshi

సాక్షి, అమరావతి: దీక్షలపై తమ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చిన వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ వీడియోను ఎవరు బయటకు పెట్టారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అందరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఈ వీడియో ఎవరు తీశారని ప్రశ్నించిన ఆయన.. చుట్టుపక్కల ఏం జరుగుతోందో, ఎవరున్నారో చూసుకోకుండా ఎలా మాట్లాడతారని అసహనం వ్యక్తం చేశారు. తీసిన వీడియో బయటకు ఎలా వెళ్లిందో, ఎవరు పంపారో తేల్చాలన్నారు.

ఈ వీడియో ఎవరు తీశారో ముందు గుర్తించాలని, దాన్ని ఎందుకు తీశారు, ఎవరెవరికి  పంపారు వంటి విషయాలను తెలుసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పరంగా దీనిపై విచారణ జరిపిస్తానన్నారు. అయితే దీనివల్ల పార్టీకి నష్టం జరగకుండా వ్యవహరించాలని, ఇదంతా బీజేపీ కుట్రని చెప్పాలని, ఎదురుదాడి చేయాలని సూచించారు. ధర్మ పోరాటానికి తూట్లు పొడిచేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేయాలని చెప్పారు. 

బహిరంగంగా మాట్లాడవద్దు..
ఒకపక్క ధర్మ పోరాటం చేస్తున్న తరుణంలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమిటని ఎంపీలపై చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. చలోక్తులు, సరదా సంభాషణలు చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నామో చూసుకోవాలని, జాగ్రత్త పాటించకుండా ఉంటే ఇలాంటివే జరుగుతాయన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో వ్యవహారంపై ఎలా స్పందించాలో కూడా పలు సూచనలు చేశారు. వీడియోను మార్ఫింగ్‌ చేశారని, కట్‌ అండ్‌ పేస్ట్‌ చేశారని చెప్పాలన్నారు. ఇలాంటి వాటి ద్వారా టీడీపీ చేస్తున్న పోరాటం, దీక్షలపై ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారని, మొక్కుబడిగా ఏదో చేస్తున్నామనే విషయం బయటకు వెళుతుందని హెచ్చరించారు.

గతంలో జరిగినవి మళ్లీ చెప్పండి.. 
గతంలో పార్లమెంటులో పోరాడినప్పుడు మురళీమోహన్‌ స్పృహ తప్పి పడిపోవడం, కొనకళ్ల నారాయణకు గుండెపోటు రావడం, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి విషయాలను చెప్పి ప్రజల దృష్టి మరల్చాలని సీఎం సూచించారు. విభజన చట్టం చేసినప్పుడు పార్లమెంటులో మోదుగుల వేణుగోపాలరెడ్డిని దారుణంగా కొట్టిన విషయాన్నిప్రచారం చేయాలన్నారు. తన మాటలను కట్‌ అండ్‌ పేస్ట్‌ చేశారని చెప్పాలని మురళీమోహన్‌కు సూచించారు. మీడియా కూడా సంయమనం పాటించాలన్నారు. వైరల్‌ అవుతున్న వీడియో గురించి ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు.  

Advertisement
Advertisement