పొన్నాల వర్సెస్‌ జంగా!

15 Jan, 2020 09:31 IST|Sakshi

సాక్షి , వరంగల్‌ : పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌ ఇవ్వలేదు. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన పొన్నాలకు ఈసారి కనీసం బీ ఫాంలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొన్నాలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో డీసీసీ నేత జంగా రాఘవరెడ్డికే బీ ఫాంలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు టీపీసీసీ ఇవ్వగా, జంగా రాఘవరెడ్డి ఒకే కుటుంబానికి రెండు రెండు టికెట్లు కేటాయించారని కాంగ్రెస్‌ నేతలు జనగామలో రోడ్డెక్కారు. చేసేదేం లేక పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ కార్యదర్శులు కంచ రాములు, ధర్మ సంతోష్‌రెడ్డి అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్‌లో బీసీలను అణిచివేశారని ఈ సందర్భంగా వారు ఆరోపణలు చేశారు. పెల్లుబికిన నిరసనలతో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి  చేరిన కాంగ్రెస్‌ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జంగా రాఘవరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  జనగామలో స్థానికేతురుడైన రాఘవరెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు