రేపు జరిగే అవకాశం.. లేదంటే సెప్టెంబర్‌ 2 తర్వాతే | Sakshi
Sakshi News home page

రేపా.. 2వ తేదీ తర్వాతా? 

Published Thu, Aug 30 2018 3:44 AM

Confusion on the Cabinet meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల కసరత్తు కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేసేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కీలకమైన మంత్రివర్గ సమావేశం ఎప్పుడు నిర్వహించాలనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. మాజీ మంత్రి హరికృష్ణ అకాల మరణం నేపథ్యంలో గురువారం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం లేదు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన సభ’ఆదివారం (2వ తేదీ) జరగనుంది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర మంత్రులు సభ ఏర్పాట్ల పరిశీలనలో నిమగ్నమై ఉంటారని, ఆ రోజు మంత్రివర్గ సమావేశం జరగకపోవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ రోజు వీలుకాని పరిస్థితుల్లో ప్రగతి నివేదన సభ తర్వాతే మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే జరిగితే మంత్రివర్గ సమావేశం రెండుసార్లు కాకుండా ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. అదే భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణ లేదా అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.  

అధికారిక నిర్ణయాల్లో వేగం 
సీఎం కేసీఆర్‌ అధికారికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి చేయాల్సిన అన్ని అధికారిక అంశాలు, హామీల అమలు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై పరిశీలిస్తున్నారు. బుధవారం సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. కీలకమైన బీసీ కులాలకు భవనాల నిర్మాణం కోసం నిధులను, స్థలాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిధుల కేటాయింపుపై ఆర్థి క శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.

Advertisement
Advertisement