ఆరెస్సెస్‌ నేపథ్యం లేకుంటే చాలు | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌ నేపథ్యం లేకుంటే చాలు

Published Wed, Jul 25 2018 1:48 AM

Congress okay with any non-RSS person as PM - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఎవరికైనా మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఖరారు చేస్తూ ఇటీవలే ఆ పార్టీ సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న వ్యక్తులకు మినహా ఇంకెవరికైనా కాంగ్రెస్‌ మద్దతివ్వాలని భావిస్తున్నట్లు తెలిపాయి.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా బీఎస్పీ అధినేత్రి మాయావతిలలో ఎవరో ఒకరు విపక్షాల ప్రధాని అభ్యర్థి కావొచ్చని ప్రచారం సాగుతుండటం తెలిసిందే. బీజేపీ దేశంలో లౌకికత్వాన్ని చెడగొట్టి, ప్రజా వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజల మధ్య విభేదాలను, ద్వేష భావాన్ని సృష్టించి, హింసకు పురిగొల్పుతోందనీ, మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని రాహుల్‌ సన్నిహితులు తెలిపారు.

టీడీపీ ఇప్పటికే బీజేపీతో తెగదెంపులు చేసుకోగా, శివసేన–బీజేపీ సంబంధాలు కూడా బలహీనపడ్డాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మళ్లీ గెలవకపోవచ్చని వారన్నారు. 2019లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాంగ్రెస్‌ ధ్యేయమనీ, బీజేపీ, ఆరెస్సెస్‌ వ్యతిరేక భావాలున్న అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీకి సొం తంగా 220 కన్నా తక్కువ సీట్లు వస్తే మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు ఎన్డీయే కూటమి పార్టీలు కూడా ఒప్పుకోవని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

Advertisement
Advertisement