ఒరలో కత్తులు.. ఓటుకు పొత్తులు | Sakshi
Sakshi News home page

ఒరలో కత్తులు.. ఓటుకు పొత్తులు

Published Sat, Nov 24 2018 3:10 AM

Congress Party leaders worry over alliance with TDP - Sakshi

నరనరాన కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణితోనే.. తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. 1982 నుంచి నిన్నటి వరకు ఈ రెండు పార్టీలకు రాజకీయంగా ఒకరి పొడ మరొకరికి గిట్టని పరిస్థితి.. అటువంటిది ఇప్పుడు పొత్తు పేరుతో జట్టు కట్టడం.. టీడీపీ పోటీలో ఉన్న చోట సహకరించాలని అధిష్టానం చెప్పడం కాంగ్రెస్‌ కేడర్‌కు మింగుడుపడటం లేదు. పొత్తు సంగతెలా ఉన్నా.. కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల ఓటు మాత్రం టీడీపీకి బదిలీ అయ్యే అవకాశాల్లేవని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. టీడీపీ పోటీచేసే చోట సహకరించడానికి క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. అసలు టీఆర్‌ఎస్‌తోనే తమకు పోటీ అని భావించిన కాంగ్రెస్‌ నాయకులు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్నాళ్లూ పోరాడుతూ వచ్చారు. తీరా ఇప్పుడు బద్ధ శత్రువైన టీడీపీతో కూటమి పేరుతో ఏకం కావడాన్ని కాంగ్రెస్‌ కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది.  

కాంగ్రెస్‌ ఓటు టీడీపీకి బదిలీ అయ్యేనా?
మహా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా టీడీపీకి 14 స్థానాలు కేటాయించారు. వీటిలో 13చోట్ల టీడీపీ అభ్యర్థులను నిలిపింది. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్లు ఆశించిన వారంతా రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ కొందరిని తప్పించగలిగింది. నామినేషన్లు ఉపసంహరించుకున్నంత మాత్రాన వీరంతా టీడీపీ అభ్యర్థులకు దన్నుగా నిలుస్తారనేది అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 13 స్థానాల్లో రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌ను కలిసి మద్దతు కోరలేదు. అంత సమయం కూడా లేదు. మరో 12 రోజుల్లో ప్రచారం ముగియనుంది. రెబల్స్‌గా ముద్రపడిన కాంగ్రెస్‌ నేతలు టీడీపీ అభ్యర్థుల ముందు ఎలాంటి డిమాండ్లు పెడతారో తెలియని పరిస్థితి. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నా.. దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రం.. కలిసి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ టీడీపీ వ్యతిరేతతో పనిచేసిన కేడర్‌.. ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా? అనేది సందేహమే. తమ నెత్తిన టీడీపీని ఎందుకు రుద్దారన్న అసహనం కార్యకర్తల్లో వ్యక్తమవుతుండటమే అందుకు నిదర్శనం. చంద్రబాబు కాంగ్రెస్‌ పెద్దలపై ఒత్తిడి తెచ్చి.. టీడీపీ అభ్యర్థులు ఉన్నచోట కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులు పోటీలో లేకుండా చేసుకోగలిగినా.. ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అంత సులువు కాదని అంటున్నారు. 

క్షేత్రస్థాయిలో ససేమిరా..
- రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్‌ నుంచి టికెట్‌ ఆశించిన సామ రంగారెడ్డిని బలవంతంగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి దించారు. ఆయన అయిష్టంగానే అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేష్‌ ఇద్దరూ కూడా నామినేషన్లు వేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి వేయగా, ఆయన తమ్ముడు రాంరెడ్డి ఎన్సీపీ నుంచి, క్యామ మల్లేష్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే, బీ ఫాం సమర్పించకపోవడంతో మల్లేష్‌ నామినేషన్‌ను స్క్రూటినీ దశలో తిరస్కరించారు. గురువారం మల్‌రెడ్డి రాంరెడ్డి తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నా.. మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం రంగంలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ సైతం ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చడంతో.. పార్టీ కేడర్‌ ఆయనకు పనిచేసే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ కూటమి అభ్యర్థిగా రంగంలో దిగిన సామ రంగారెడ్డికి చుక్కలు కనిపించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి
మహబూబ్‌నగర్‌లో కూటమి అభ్యర్థిగా  ఎర్ర శేఖర్‌ (టీడీపీ) పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన సయ్యద్‌ ఇబ్రహీం.. బీఎస్పీ నుంచి, మరో నేత సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి బరిలోకి దిగారు. వీరికి కాంగ్రెస్‌ అగ్రనేతల అండ ఉందని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ కేడర్‌ ఓటు టీడీపీకి బదిలీ కావడం అనుమానమే..
వరంగల్‌ పశ్చిమ నుంచి రెబల్‌గా నామినేషన్‌ వేసిన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి.. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీనివ్వడంతో నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. కాని ఆయన అనుచరులంతా కాంగ్రెస్‌ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు టీడీపీకి సహకరించడం కష్టమేనని సమాచారం
ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయకపోయినా.. పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రేణుకాచౌదరి, పొట్ల నాగేశ్వరరావు.. ‘నామా’కు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. టీపీసీసీ పెద్దలు తనకు అవకాశం లేకుండా చేయడానికే ఖమ్మం స్థానాన్ని కూటమికి ఇచ్చారన్న ఆగ్రహంతో సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఆయన టీడీపీ జెండాతో కలిసి ప్రచారానికి వెళ్లడం కష్టమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, తన అనుచరుల్లో ఒక్కరికీ అధిష్టానం టికెట్‌ ఇవ్వకపోవడంతో..రేణుకాచౌదరి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆమె నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేస్తారా? లేదా? అనేది అస్పష్టంగా ఉంది
అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ నుంచి వేసిన నామినేషన్‌ను నాగమణి ఉపసంహరించుకున్నా.. ఆమె టీడీపీ అభ్యర్థి మచ్చ నాగేశ్వరరావు గెలుపునకు మనస్ఫూర్తిగా పని చేయడం 

కష్టమేనని అంటున్నారు
సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు పెద్దగా ఇబ్బందులు లేవు, మక్తల్‌లోనూ తిరుగుబాటు లేదు.
సనత్‌నగర్‌లో సీనియర్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డికి టికెట్‌ రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేసే అవకాశాలు లేవని ఆయన అనుచర వర్గం చెబుతోంది. 
ఉప్పల్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కానీ కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులు టీడీపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌కు సహకరించేది అనుమానమే
శేరిలింగంపల్లిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌.. టీడీపీ అభ్యర్థి ఆనంద్‌ప్రసాద్‌కు మద్దతు ఇస్తానని కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దల ముందు అంగీకరించినా.... ఆయన అనుచరులు మాత్రం టీడీపీతో వెళ్లడానికి సిద్ధంగా లేరు. అహ్మద్‌పటేల్‌ స్వయంగా ఇంటికి వచ్చి బుజ్జగించడంతో భిక్షపతియాదవ్‌ మెత్తబడ్డారు. కాని మనస్ఫూర్తిగా టీడీపీకి ప్రచారం చేసే అవకాశాలు తక్కువే..
మలక్‌పేటలో రెబల్స్‌ ఎవరూ లేరు. కూకట్‌పల్లిలో గొట్టిముక్కల వెంగళ్రావు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. 
రాజేంద్రనగర్‌ నుంచి కాంగ్రెస్‌కు చెందిన కార్తీక్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకున్నా.. ఆయన టీడీపీ అభ్యర్థి గణేశ్‌గుప్తాకు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానమేనని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

‘ఈ రోజుల్లోనూ ఇలా ప్రచారమా...వహ్వా’ అంటూ జనవాహిని పార్టీ అభ్యర్థిని పొగడ్తల్లో ముంచెత్తారు కడ్తాల్‌ ప్రజలు. కల్వకుర్తి బరిలో ఉన్న హర్యా నాయక్‌ వినూత్నంగా ఎడ్లబండిపైనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాంటి వాహనాలు లేకుండా..హంగూ ఆర్భాటాలకు తావులేకుండా ఎడ్ల బండికి మైక్‌ ఏర్పాటు చేసుకుని ఉంగరం గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా శుక్రవారం కడ్తాల్‌కు ఎడ్లబండిపై వచ్చిన హర్యా నాయక్‌ రోజంతా.. వీధివీధి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మిగతా అభ్యర్థులు పెద్దపెద్ద కార్లలో వచ్చి ప్రచారం నిర్వహిస్తుంటే.. ఈయన ఎడ్లబండిపై రావడం కొత్తగా ఉన్నదని స్థానికులు వ్యాఖ్యానించారు.  తనకు ఆర్థిక స్థోమత లేనందునే ప్రచారంలో ఖర్చు తక్కువగా ఉండే చిన్న వాహనాలను వినియోగించుకుంటున్నానని హర్యానాయక్‌  పేర్కొనడం గమనార్హం. 
– కడ్తాల్‌(కల్వకుర్తి)

Advertisement
Advertisement