వెతికి వెతికి.. మరీ ఇస్తాం: రాహుల్‌ | Sakshi
Sakshi News home page

పేదలందరికీ కనీస ఆదాయం కల్పిస్తాం: రాహుల్‌

Published Sat, Mar 9 2019 7:42 PM

congress will guarantee minimum income to every citizen, says Rahul - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోని పేద ప్రజలందరికీ కనీస ఆదాయం కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. శనివారం సాయంత్రం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. కనీస ఆదాయ పరిమితికి దిగువన ఉన్న అందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు.  కనీస ఆదాయం లేని ఒక్క వ్యక్తిని కూడా.. వెతికి వెతికి.. కనీస ఆదాయం ఇస్తామని అన్నారు. యూపీఏ హయంలో మూడు రాష్ట్రాల్లో రుణమాఫీని మూడు రోజుల్లో అమలు చేశామన్న రాహుల్‌ అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి, రైతులను ఆదుకుంటామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపే రోజు వచ్చిందని...ఆయన అనిల్‌ అంబానీ వంటి సంపన్నులకే సహాయపడుతున్నారని, రఫెల్‌ కుంభకోణంలో రూ.30వేట కోట్లు దొంగలించి అంబానీకి కట్టబెట్టారని రాహుల్‌ మరోసారి విరుచుకుపడ్డారు. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా రుణాలు ఎగ్గొట్టి విదేశాలు పారిపోయినా పట్టించుకోరని విమర్శలు గుప్పించారు. అన్ని కోట్లు దోచుకున్నా వారిపై విచారణ ఉండదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కోసం రైతులు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించరని అన్నారు. దేశాన్ని మోసగిస్తున్న బీజేపీ సర్కార్‌కు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సహకరించారన్నారు. నోట్ల రద్దును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారని, జీఎస్టీతో వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ మాత్రం బాగుందన్నారని రాహుల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్‌ అవినీతి చిట్టా మోదీ చేతిలో ఉందని, అందుకే నోట్ల రద్దును కేసీఆర్‌ ప్రశ్నించలేదన్నారు. 

మోదీ అయిదేళ్ల పాలనలో దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారని, అందులో ఒక భాగాన్ని ధనవంతుల కోసం ఏర్పాటు చేశారని అన్నారు. మోదీ కేవలం 15మంది పెట్టుబడిదారుల కోసమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని రెండు ముక్కలు కానీవ్వమని రాహుల్‌ స్పష్టం చేశారు. మోదీ పాలనలో మహిళలు బయట తిరుగలేని పరిస్థితి నెలకొందన్నారు. యూపీలో ఓ మహిళా ఎమ్మెల్యేపై అత్యాచారయత్నం జరిగినా ఇప్పటివరకూ చర్యలు లేవని రాహుల్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదిస్తామని తెలిపారు. ఇక రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని రాహుల్‌ సూటిగా ప్రశ్నించారు. 

దేశభక్తుడిని అని చెప‍్పుకునే మోదీ... దేశానికి సంబంధించిన డబ్బులను 15మంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇస్తారా? అని ప్రశ్నించారు. దేశ రక్షణకు వస్తే ప్రధాని మోదీ మాత్రం చైనా అధ్యక్షుడితో చెట్టాపట్టాలు వేసుకుని చాయ్‌ తాగుతుంటే ...చైనా మాత్రం డోక్లంలో తన సైన్యాన్ని నిలిపిందన్నారు. సైనికులు మీద దాడి జరుగుతుంటే ...ప్రధాని మాత్రం తన మీద సినిమా తీయించుకుంటున్నారన్నారు. సైనికులు అమరులైనా మోదీ మూడున్నర గంటల సినిమాలో నటిస్తారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement