ప్రధాని పొగడ్తలకు నేను పొంగిపోలేదు | Sakshi
Sakshi News home page

ప్రధాని పొగడ్తలకు నేను పొంగిపోలేదు

Published Thu, May 3 2018 9:12 AM

Deve Gowda rules out BJP JD(S) alliance after PM Modi praise-fest - Sakshi

శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ప్రత్యేక అర్థం కల్పించాల్సిన అవసరం లేదని, ప్రస్తుత విధానసభా ఎన్నికల్లో సొంత బలంతోనే అధికారంలోకి వస్తామని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌.డీ.దేవేగౌడ అన్నారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జేడీఎస్‌ అనుకూల పవనాలు వీస్తున్నాయని, అందుచేత ఏ పార్టీతో ఎన్నికల తరువాతపొత్తు అవసరం రాదని చెప్పారు. ప్రధాని మోదీ మంగళవారం కర్ణాటక పర్యటనలో దేవేగౌడను కొనియాడడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ బీజేపీ– జడీఎస్‌ కుమ్మక్కు అయినట్లు విమర్శలు సంధిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకుని మాట్లాడారని, ఆయన పొగడ్తలకు తానేమి ఉప్పొంగిపోలేదని దళపతి చెప్పారు. అలాగే ప్రధాని మోదీలో కూడా ఎలాంటి మార్పులు రాలేదన్నారు. రాష్ట్రంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, కన్నడిగుడు కావటంతో ఈ రాష్ట్రానికి వచ్చినపుడు అలా మాట్లాడటం సహజమేనని తెలిపారు. ఇందుకు ఏవేవో అర్థాలు సృష్టించాల్సిన పని లేదన్నారు.

సిద్ధరామయ్య నా ఫోటో తీసేయించారు
కన్నడిగుడు దేశ ప్రధాని కావటంతో అప్పటి ముఖ్యమంత్రి జే.హెచ్‌.పటేల్‌ ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయంలో తన ఫోటోను ఏర్పాటు చేశారు, ఆ తరువాత ముఖ్యమంత్రులైన ఎస్‌.ఎం.కృష్ణ, ధరంసింగ్, హెచ్‌.డీ.కుమారస్వామి, బీ.ఎస్‌. యడ్యూరప్ప కూడా తన ఫోటోను తీయించలేదని చెప్పారు. అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయిన తక్షణమే తన ఫోటోను తీసేయించారని విమర్శించారు. ఓ కన్నడిగుడు ప్రధాని అయ్యారనే గౌరవం ఇవ్వాలనే సంస్కారం సైతం సిద్ధరామయ్యకు లేదని మండిపడ్డారు. దేవేగౌడ వస్తే తలుపులు తెరుస్తానని మోదీ వ్యాఖ్యానించటాన్ని పలువురు పలు విధాలుగా అర్థం చేసుకొంటున్నారని, అయితే ప్రధాని ఒక రాష్ట్రానికి వెళ్లిన సందర్భంలో అన్ని విషయాలను తెలుసుకుని మాట్లాడతారని తెలిపారు.  మహదాయి వివాదాన్ని పరిష్కరించాలని ప్రధానిని పలుమార్లు కలిసి కోరినా చొరవ చూపటం లేదని దేవేగౌడ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలనుకోవడం వె నుక పుత్ర వ్యామోహం ఏమీ లేదని, ప్రాంతీయ పార్టీని కాపాడుకోవా లని శ్రమిస్తున్నానని తెలిపారు.

Advertisement
Advertisement