వాళ్లు తప్ప సమర్థులు లేరా?: ఫడ్నవీస్‌ | Sakshi
Sakshi News home page

వాళ్లు తప్ప సమర్థులు లేరా?: ఫడ్నవీస్‌

Published Wed, Dec 5 2018 3:51 AM

Devendra Fadnavis comments on Congress and TRS - Sakshi

సాక్షి, సిరిసిల్ల/మద్నూర్‌: కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ దాకా పార్టీలన్నీ కుటుంబ పాలనను అనుసరిస్తూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలను తలపిస్తున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శించారు. బీజేపీ ఒక్కటే అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతున్నదని చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో, అలాగే.. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుందలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. పూర్వకాలంలో రాణి కడుపున పుట్టినవారికే రాజయోగం దక్కేదని, దాన్ని రూపుమాపేందుకే అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించారని చెప్పారు. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలు తిలోదకాలిస్తున్నాయని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎంతోపాటు కొడుకు, బిడ్డ, అల్లుడు తప్ప పార్టీ కార్యకర్తల్లో ఇంకెవరూ సమర్థులు లేరా? అని ప్రశ్నించారు. బీజేపీలో మాత్రమే ఒక రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకునే చాయ్‌వాలా ప్రధానమంత్రి, చిన్న కార్యకర్త ఆ పార్టీకి అధ్యక్షుడు కాగలడని తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశం మొత్తానికి స్వాతంత్య్రం వస్తే.. హైదరాబాద్‌ రాష్ట్రంతోపాటు మరఠ్వాడా ప్రాంతానికి 1948 సెప్టెంబరు 17న విముక్తి లభించిందన్నారు. మహారాష్ట్రలో ఆ రోజున విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండగా.. తెలంగాణలో నిర్వహించకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవం రోజున అధికారికంగా మూడు రంగుల జెండా ఎగురుతుందని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి కేసీఆర్‌ దేవున్ని కూడా మోసగించారని ఆరోపించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement