రాష్ట్రానికి అప్పులు.. చంద్రబాబుకు ఆస్తుల కుప్పలు | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి అప్పులు.. చంద్రబాబుకు ఆస్తుల కుప్పలు

Published Fri, Sep 28 2018 7:53 AM

Dharmana Prasada Rao Slams Chandrababu Naidu - Sakshi

శ్రీకాకుళం రూరల్‌: రాష్ట్రానికి అప్పులు చూపించడం.. చంద్రబాబు ఆస్తులు పెంచుకోవడమే నిత్యకృత్యంగా మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా గురువారం రాత్రి శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని సింగుపురంలో నిర్వహించిన సంఘీభావ పాదయాత్ర బహిరంగ సభలో ధర్మాన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రంగులు మార్చే ఊసరవల్లి లాంటి వారని ధ్వజమెత్తారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో విభేదించి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీతో జతకలవడం సిగ్గుచేటన్నారు. అధికారంలో నాలుగేళ్లు ఉన్నంతవరకూ ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారని బహిరంగంగా చెప్పి ఇప్పుడు కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం బాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకొని, అదే సమయంలో జనసేనా పార్టీ మద్దతుతో గెలిచిన టీడీపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందంటూ జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌ ఇటీవల ప్రస్తావించిన విషయాన్ని ధర్మాన గుర్తుచేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాకే బస్‌చార్జీలు, కరెంట్‌ చార్జీలు, స్టాంప్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక కేంద్రం 13 జిల్లాలో 12 సంస్థలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మన జిల్లాకు చెందిన మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ ఏదైనా సంస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. ఎంతసేపూ వాటాలు తప్ప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించే నాథుడే లేరన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులు నుంచి దరఖాస్తులు తీసుకున్నారే తప్ప ఎవరిౖనా ఒక్క పాలసీ సొమ్ము అయినా ఇప్పించారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, రెండువేల రూపాయలు నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు పలికారే తప్ప వాటిని అమలు చేయలేదని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు మూకళ్ల తాతబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువనాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దనరావు, బగ్గు అప్పారావు, నక్క శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement