సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

Published Fri, Mar 1 2019 12:28 PM

DSP Warnings Rowdy sheeters YSR Kadapa - Sakshi

కడప అర్బన్‌: రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత పోలింగ్‌కు అప్రమత్తంగా ఉంటూ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ఇప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిని, రౌడీషీటర్లను బైండోవర్‌ చేయాలన్నారు. ఫ్యాక్షన్‌ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు. ఏ కేటగిరి, బి కేటగిరి గ్రామాల్లో డీఎస్‌పీలు, సి కేటగిరి కింద గ్రామాల్లో సీఐలు తప్పనిసరిగా సందర్శించాలని పేర్కొన్నారు. డి కేటగిరిలో ఉన్న గ్రామాలను ఎస్‌ఐలు సందర్శించాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిల్లో వివిధ వ్యక్తులు, సంస్థల వద్ద ఉన్న ఆయుధాలను డిపాజిట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సిఐలు, ఎస్‌ఐలు అత్యంత సమస్యాత్మక గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘటనకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి కానిస్టేబుల్‌ వ్యక్తిగతంగా గ్రామాలకు వెళ్లాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లపై నిఘా ఉంచి అరికట్టాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్డు భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రహదారులపై బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మిస్సింగ్‌ కేసులపై దృష్టి సారించి కేసులను ఛేదించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఏ. శ్రీనివాసరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) బి. లక్ష్మినారాయణ, ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement