వారి కోపాన్ని అర్థం చేసుకోగలం | Sakshi
Sakshi News home page

వారి కోపాన్ని అర్థం చేసుకోగలం

Published Wed, Oct 3 2018 1:50 AM

Etela Rajender says about Unemployed issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై కొంత కోపం ఉండవచ్చని, దాన్ని అర్థం చేసుకోగలమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. భూతల స్వర్గం అమెరికాలోనూ ఉద్యోగాల కల్పన తగ్గిందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కల్పించే ఉద్యోగాలు 4 శాతమేనని... ప్రైవేట్‌ రంగమే 96 శాతం కల్పిస్తుందన్నారు. ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. నిరుద్యోగులకు మరింత మేలు చేసేందుకు టీఆర్‌ఎస్‌ ఆలోచన చేస్తోందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు అదే పనిగా ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నాయి.

ఉద్యమంలోనూ కేసీఆర్‌పై ఇలాగే విషప్రచారం చేశారు. కేసీఆర్‌ మాత్రం మొక్కవోని దీక్షతో 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. నినాదంతోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్‌పై నమ్మకంతోనే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారు. గత నాలుగున్నరేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఆయన కృషి చేశారు. తెలంగాణ వారికి పాలన రాదని చేసిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా చర్యలు చేపట్టాం. తెలంగాణ ప్రభుత్వ పాలన తీరుకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. 

సత్వర అభివృద్ధి కోసమే అప్పులు... 
తెలంగాణ సత్వర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నాం. ఉన్న కాడికే కాలు చాపుకోవాలనే విధానం తప్పు. శ్రీరాంసాగర్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను అప్పుడే పూర్తి చేసుంటే ఇప్పుడు అప్పులు చేయాల్సి వచ్చేదా? 24 గంటల ఉచిత విద్యుత్‌తో తెలంగాణలో అమావాస్య చీకట్లు తొలగిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నారో చెప్పాలి. మన నిధులు మనకే ఖర్చు చేసే అవకాశం తెలంగాణ ఏర్పాటుతో కలిగింది. నీళ్లు, నిధుల విషయంలో సంపూర్ణ విజయం సాధించాం. గతంలో నిధుల కోసం సచివాలయంలో ధర్నాలు చేశాం. ప్రగతిశీల రాష్ట్రాలని చెప్పుకునేవాటి కన్నా తెలంగాణ అతి తక్కువ కాలంలో దేశంలో నంబర్‌ వన్‌ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు చేసే చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు చేయూత ఇచ్చాం. దాదాపు ఐదు లక్షల కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు పెంచాం.

గత నాలుగున్నరేళ్లలో 1,28,274 ఉద్యోగాల నియామకం కోసం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. వీటిలో 87,346 ఉద్యోగాల నియామానికి నోటిఫికేషన్లు ఇస్తే... ఇప్పటికి 37,781 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి. ప్రజలు ఆత్మ గౌరవంతో, సంతోషంతో బతికేందుకు ప్రభుత్వం చర్చలు తీసుకుంటోంది. నాలుగేళ్లలో ఎంతో చేశాం. కొన్ని పరిష్కారం కాకపోవడానికి గత పాలకుల విధానాలే కారణం. ఎవరేం చేసినా తెలంగాణలో గుబాళించేది గులాబీ జెండానే. కులం, మతం పునాదులపై రాజకీయాలు చేయాలనుకునే వారు గొప్ప నేతలు కాలేరు. మా పథకాలు కులాలు, మతాలకు అతీతమైనవి. దొడ్డిదారిలో అధికారంలోకి రావాలనుకునే వారే కులం, మతం ప్రస్తావన తెస్తున్నారు. చెప్పింది చేసినం కాబట్టే ప్రజలు మా పార్టీని నమ్ముతారు. సీఎం కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు’అన్నారు. 

చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హైదరాబాద్‌ యూత్‌ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఈటల ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘దేశంలో జరుగుతున్న సంఘటనలపై చర్చిస్తున్న మీరు రాజకీయాల వైపు అడుగులు వేయాలి. చదువురానివాడు, బడికిపోనివాడు రాజకీయ నాయకులు అవుతారనే తప్పుడు అభిప్రాయం ఉంది. అందుకే మీలో చాలామంది రాజకీయాల వైపు చూడటం లేదు. చదువుకున్న వారు, సమాజంపై అవగాహన ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చిన రోజే సమాజం బాగుపడుతుంది. సాంకేతికత, శాస్త్ర విజ్ఞానం మానవ జీవితాన్ని వికసింప చేయాలి. అణ్వాయుధాలు తయారు చేయడం కంటే గుండెలో వేయడానికి అతి తక్కువ ఖరీదు ఉండే స్టెంట్లు తయారు చేయడంలోనే అత్యంత సంతోషం ఉంది. సమాజంలో అంతరాలు నశించాలి. తెలంగాణలో అరాచకాలకు, మాదక ద్రవ్యాలకు తావులేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకొనే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాం’అని అన్నారు. 

Advertisement
Advertisement