రాజకీయాల్లోకి ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ! | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ!

Published Fri, Mar 23 2018 3:42 AM

Ex- CBI JD Lakshmi Narayana Resign as IAS Officer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేయనున్నారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేందుకు గురువారం మహారాష్ట్ర డీజీపీ నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. ఆయన పదవీ విరమణ లేఖను ఆ రాష్ట్ర సీఎస్‌కు అందజేసినట్టు లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తారంటున్నారు.

మహారాష్ట్ర కేడర్‌ నుంచి..:  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన లక్ష్మీనారాయణ 1990లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ఆ రాష్ట్రంలో యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఎస్పీగా, సీబీఐ హైదరాబాద్‌ రేంజ్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, థానే జాయింట్‌ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది మహారాష్ట్ర పోలీసు శాఖ అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ హోదాలో వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నారు.

అటు మహారాష్ట్ర కేడర్‌తోపాటు ఇటు ఏపీ, తెలంగాణ క్యాడర్లలో ఉన్న ఐపీఎస్‌లలో జరుగుతున్న చర్చను బట్టి... లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లక్ష్మీనారాయణ స్నేహితులు కొందరు బీజేపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఏపీలోని ఆయన చిన్ననాటి స్నేహితులు మాత్రం ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ పెడతారని అంటున్నారు.

గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ స్నేహితుడొకరు మాత్రం ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్‌ కల్యాణ్‌తో జతకడతారని, త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. దీనిపై మీడియా వర్గాలు లక్ష్మీనారాయణను సంప్రదించగా... తాను వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నది నిజమేనని, తన భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement