సాగు చతికిలపడిందన్నా.. | Sakshi
Sakshi News home page

సాగు చతికిలపడిందన్నా..

Published Sun, Sep 9 2018 4:13 AM

Farmers says their problems with YS Jagan At Pendurthi - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘వ్యవసాయానికి ఆ పెద్దాయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెద్దపీట వేశారు. రైతుల్ని అన్ని విధాలా ఆదుకున్నారు. నీళ్లు వచ్చేవి.. నిధులు ఇచ్చేవారు.. ఆదర్శ రైతుల్నీ ప్రోత్సహించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంటల పోటీలు పెట్టి అభ్యుదయ రైతులకు అవార్డులు ఇచ్చిన ఘనత ఆయనదే. ఆ పెద్దాయన వెళ్లిపోయాక ఆదర్శ రైతు వ్యవస్థను కుప్పకూల్చారు. ఎక్కడ చూసినా కరవే. గిట్టుబాటు ధర లేదు. రుణమాఫీ లేదు. నాలుగేళ్లుగా అన్నీ కష్టాలే’ అంటూ రైతన్నలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 257వ రోజు శనివారం ఆయన విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతుల పాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గం మధ్యలో గవరపాలేనికి చెందిన రైతులు జగన్‌ కలిసి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంనాటి వ్యవసాయ వైభవాన్ని వివరించారు. ‘ఇప్పుడేదో ప్రకృతి సేద్యం, సేంద్రీయ సేద్యమని చంద్రబాబు చెబుతున్నారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలోనే మేము సేంద్రీయ పద్ధతిన విశాఖ జిల్లాలో వరి సాగు చేసి అధిక దిగుబడి తీసి అవార్డు పొందాం’ అంటూ పలువురు మహిళలు, నాడు వ్యవసాయ విస్తరణాధికారులుగా పని చేసిన వారు గుర్తు చేసుకున్నారు. 
 
మహిళా రైతులనూ ప్రోత్సహించారు 
రైతులంటే పురుషులే కాదు మహిళలు కూడా.. అని గుర్తించడమే కాకుండా వారిని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వ్యక్తి డాక్టర్‌ వైఎస్‌ అంటూ అప్పటి పాలనను, చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితిని పలువురు సోదాహరణంగా జగన్‌కు వివరించారు. వరి ఉత్పత్తిలో తాను అధిక దిగుబడి సాధించినందుకు 2005 ఏప్రిల్‌ 9న ఉగాది నాడు హైదరాబాద్‌కు పిలిపించి రవీంద్రభారతిలో అవార్డు ఇచ్చారంటూ ఆనాడు ఇచ్చిన కప్పును ఓ మహిళ జగన్‌కు చూపించి సంబరపడ్డారు. ఆనాడు పెందుర్తి ప్రాంతంలో వ్యవసాయ విస్తరణాధికారిగా పని చేసిన కేవీ నూకేశ్వరరావు.. డాక్టర్‌ వైఎస్సార్‌తో తనకున్న పరిచయాన్ని, ఆయన హయాంలో అన్నదాతలకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశ పెట్టిన పొలంబడి కార్యక్రమంతో రైతులకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. రైతు బాంధవుడు అంటే ఆయనేనన్నారు. ఉగాది సందర్భంగా కవులు, కళాకారులకు మాత్రమే అవార్డులు ఇచ్చే సంస్కృతిని డాక్టర్‌ వైఎస్‌ మార్చి రైతుల్నీ ఆవేదిక మీదకు తీసుకువచ్చిన తొలి ముఖ్యమంత్రి అని కొనియాడారు. గత నాలుగేళ్లుగా రైతులు పడుతున్న పాట్లను ఏకరవుపెట్టారు. బాబు పాలనలో సాగు చతికిలబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
విశాఖ నగరాన.. ఆనందహేల.. 

ప్రజా సంకల్పయాత్ర గురువారం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు అత్యంత కోలాహలంగా సాగింది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గాన్ని దాటి కాస్మోపాలిటన్‌ నగరమైన విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెందుర్తి నియోజకవర్గంలోని జెర్రిపోతులపాలెం, పెదనరవ, కోట నరవలో దారి పొడవునా ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. బాలికలు భారతీయ నృత్య రీతులతో స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లు, గుర్రాలు, ఒంటెలపై విన్యాసాలు చేస్తూ ఎదురేగి తమ నియోజకవర్గంలోకి ఆహ్వానించారు. రెడ్‌ కార్పెట్లు పరిచి పూల వర్షం కురిపించారు. కొత్తపాలెం వద్ద కోట గుమ్మాలను తలపించే రీతిలో ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. సినిమా సెట్‌ను తలపించేలా ఉన్న ఈ ముఖద్వారంపై శంఖారావం పూరిస్తున్న జగన్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ సెట్లు వేశారు. మద్య నిషేధానికి సంబంధించి వేసిన సెట్‌ బాగా ఆకట్టుకుంది. పశ్చిమాన ఆకాశం ఎర్రబారి సూర్యుడు అస్తమించే వేళ, వేయి అడుగుల పార్టీ పతాకం రెపరెపలు, పతాకంలోని మూడు రంగులకు సూచికగా అదే రంగు చీరెలు ధరించిన మహిళా శ్రేణులు, పార్టీ పతాకాలు చేతబూని టోపీలు పెట్టుకున్న యువతీ యువకుల హర్షాతిరేకాల మధ్య జగన్‌ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. జగన్‌ నడిచిన దారి పొడవునా పార్టీ గుర్తు అయిన ఫ్యాన్లు తిరుగుతున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి మహిళలు జగన్‌తో కరచాలం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటెత్తారు. అదే సమయంలో తమ బాధలను చెప్పుకుంటూ ఆయనతో కలిసి అడుగులో అడుగు వేశారు. కొత్తపాలెం నుంచి భగత్‌సింగ్‌నగర్, కార్వల్‌ నగర్, సాయినగర్, అప్పలనరసయ్యకాలనీ, నాగేంద్రకాలనీ, గణపతినగర్, శ్రీరామ్‌నగర్‌ల మీదుగా గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్‌ వరకు పాదయాత్ర సాగింది.   
 
మా భూమి కాజేయజూస్తున్నారయ్యా.. 
పాదయాత్ర ప్రారంభంలో జెర్రిపోతుల పాలెం వద్ద పలువురు దళితులు జగన్‌ను కలిసి తమ గ్రామంలో టీడీపీ నేతల ఆగడాలను వివరించారు. సర్వే నెంబర్‌ 77లో దళితుల స్వాధీనంలో 14 ఎకరాల భూమి ఉంటే పది ఎకరాలను బాట్లింగ్‌ కంపెనీ వాళ్లు తీసుకున్నారని, మూడు ఎకరాల్లో లే ఆవుట్లు వేశారని, మిగిలిన ఎకరంలో దళితులు ఉంటుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ల కన్ను దీనిపై పడిందని వాపోయారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిౖపై జగన్‌ స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దళితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు దాచుకున్న వారికి న్యాయం చేయాలంటూ అనేక మంది జగన్‌కు విన్నవించారు. పిల్లల పెళ్లిళ్లు చేయలేక, చదివించుకోలేక వృద్ధాప్యంలో ఇక్కట్లు పడుతున్న తమకు ఆత్మహత్యలే శరణ్యం అని వాపోయారు.  నీటి సరఫరా విభాగంలో ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న సిబంది, రజకులు, దస్తావేజులేఖరులు, ఏపీ హౌసింగ్‌ బోర్డు తీసుకున్న భూముల్ని తిరిగి ఇప్పించాలని పెదనరవ గ్రామ డి – పట్టా భూమి రైతులు జననేతకు సమస్యలు వివరించారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఓపికగా వింటూ.. కొన్నింటిని అక్కడే పరిష్కరిస్తూ.. మరికొన్నింటిని మనందరి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగారు. కాగా, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జగన్‌తో పాటు కలిసి చదివిన పలువురు స్నేహితులు పాదయాత్రలో ఆయన్ను కలిశారు. జగన్‌.. ఒకటి నుంచి 12వ తరగతి వరకు క్లాస్‌ లీడర్‌గా, రెడ్‌ హౌస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారని ఆయన స్నేహితుడొకరు గుర్తు చేసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలోని కంచర్లపాలెం వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.  

నా పింఛన్‌ తీసేశారయ్యా.. 
బాబూ.. మీ నాన్న రాజశేఖరరెడ్డి వచ్చాక నాకు రెండొందల పింఛన్‌ మంజూరు చేశారు. చాలా రోజుల పాటు పింఛన్‌ తీసుకున్నాను. ఈ సెంద్రబాబు వచ్చేక నా పింఛనీ తీసేశారు. మా ఊళ్లో కొంత మంది కుర్రోళ్లతో కమిటీ వేసి మా పింఛనీ తీసేసారు. నేనేం పాపం చేశానో తెలియడం లేదు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వే న్యాయం చెయ్యాలి బాబూ.. 
– టి.కనకారావు, నరవ, పెందుర్తి మండలం 

ఆరోగ్యశ్రీ నాడు ఆదుకుంది.. నేడు పొమ్మంది 
మాది పెందుర్తి మండలం నరవ. 2013లో మా పాప హృదయశ్రీకి హార్ట్‌ సమస్య రావడంతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. రూ.11 లక్షల విలువయ్యే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని ఉచితంగా చేశారు. వైఎస్‌ ప్రవేశ పెట్టిన పథకం వల్లే మా పాప బతికింది. ఇప్పుడు మా పాపకు ఏడేళ్లు. మూడు నెలల క్రితం మళ్లీ సర్జరీ అవసరమన్నారు. ఆరోగ్య శ్రీ కింద దరఖాస్తు చేసుకున్నా కానీ ఫలితం లేకుండాపోయింది. రూ.6 లక్షలు అప్పు చేసి ఆపరేషన్‌ చేయించాము. ఈ విషయాన్ని జగనన్నకు చెప్పాము. మన ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు.      
– జ్యోతి 

వైఎస్సార్‌ మాకు ఉద్యోగాలు ఇచ్చారు.. 
బీటెక్, డిప్లామో, ఐటీఐ చదివి నిరుద్యోగులుగా ఉన్న మాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే ఉద్యోగాలు వచ్చాయి. 2006లో ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2500 మందికి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు కల్పించారు. అయితే ఈ ప్రభుత్వ తీరు వల్ల ఉద్యోగ భద్రత కరువైంది. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. కనీస వేతనాలు అమలు చేయడం లేదు. మా సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లాము. ఆయన నుంచి భరోసా లభించింది. 
– వి.శ్రీనివాసరావు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు 

వైఎస్సార్‌సీపీలోకి నేదురుమల్లి రామ్‌కుమార్‌ 
గోపాలపట్నం (విశాఖపట్నం): మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం కోటనరవలో శనివారం ఆయనకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రామ్‌కుమార్‌ నేతృత్వంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి భారీగా నాయకులు, అభిమానులూ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు జననేత.. కండువాలు వేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తిరుపతి తాజా మాజీ ఎంపీ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, సుల్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిక మురళి తదితరులు పాల్గొన్నారు.  

జనం ఆకాంక్ష.. జగన్‌ నాయకత్వం 
తమ రాజకీయాలకు విశాఖ సెంటిమెంట్‌ అని రామ్‌కుమార్‌ అన్నారు. తన తండ్రి విశాఖ ఎంపీగా కావడానికి ఇక్కడి ప్రజల ఆదరణే కారణమని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి 1.75 లక్షల మెజారిటీ ఇచ్చిన జిల్లా విశాఖ అని తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండగా, రాష్ట్ర విభజనకు ఎవరూ సాహసించలేదని, ఆయన అకాల మరణంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. చంద్రబాబును ఎన్నుకుని తప్పు చేశామన్న ఆవేదన రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. ఇప్పుడు ప్రజల్లో ఉంటూ కష్టాలు తెలుసుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇచ్చి అధికారంలోకి తేవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. జనం ఆకాంక్ష మేరకే తాను వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకుని పార్టీలో చేరానన్నారు. పూర్వం రాజులు దేశాటన చేశాక అధికారం పీఠంపై కూర్చొనేవారని, అలాగే జగన్‌మోహన్‌రెడ్డి కూడా వచ్చే రోజుల్లో అధికారంలోకి వస్తారని చెప్పారు.    

Advertisement
Advertisement