సింగూరు జలాలపై రగడ | Sakshi
Sakshi News home page

సింగూరు జలాలపై రగడ

Published Tue, Nov 7 2017 1:27 AM

Fight on the waters of Singur - Sakshi

సంగారెడ్డి టౌన్‌: సింగూరు నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటి విడుదలను నిరసిస్తూ సోమవారం సంగారెడ్డి జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కాంగ్రెస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ‘చలో కలెక్టరేట్‌’కార్యక్రమం నిర్వహించగా.. బీజేపీ ఆధ్వర్యంలో సింగూరు ప్రాజెక్టు ముట్టడికి యత్నించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ జిల్లా కమిటీ పిలుపు మేరకు ‘చలో కలెక్టరేట్‌’ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందో ళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయ త్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.  పోలీసులు, కార్యకర్తలకు మధ్వ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

చివరికి పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సింగూరు జలాలను తరలించడం జల దోపిడీయేనని కాంగ్రెస్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా అ«ధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్‌ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రాజకీయ భిక్ష పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజ లే బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మరోవైపు బీజేపీ ఆధ్వ ర్యంలో సింగూరు ముట్టడికి యత్నించారు. సీఎం కేసీఆర్, హరీశ్‌లపై ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. సింగూరు నీటి తరలింపుపై ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం జిల్లా నేతలు నిలదీశారు.

Advertisement
Advertisement