ఎట్టకేలకు లోకేష్‌ నామినేషన్‌ ఆమోదం | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు లోకేష్‌ నామినేషన్‌ ఆమోదం

Published Wed, Mar 27 2019 5:10 AM

Finally Lokesh nomination was approved - Sakshi

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్‌ నామినేషన్‌ను అధికారులు ఎట్టకేలకు ఆమోదించారు. మంగళవారం ఉదయం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నామినేషన్‌ పరిశీలనకు రాగా లోకేష్‌ తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం తెలిపారు. నోటరీ చేసిన న్యాయవాది నోటరీ కాలపరిమితి ముగిసిందని, నామినేషన్‌ చెల్లదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో నోటరీ చేసిన న్యాయవాది రుద్రు శ్రీనివాసరావు ప్రభుత్వం రెన్యువల్‌ చేసిన పత్రాలను చూపించడంతో వెంటనే ఆర్కే నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి మెమ్మాబేగం ఆమోదించారు. అనంతరం టీడీపీ అభ్యర్థి లోకేష్‌ నామినేషన్‌ పత్రాల పరిశీలనలో నోటరీ చేసిన విధానంపై ఎమ్మెల్యే ఆర్కే తరఫున హాజరైన న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఆర్కే తరఫున పున్నం జనార్ధనరెడ్డి, ఆల్లం రమేష్‌ లేవనెత్తిన అభ్యంతరాలతో అధికారులు ఏమీ తేల్చుకోలేక లోకేష్‌ తరఫున న్యాయవాదులకు 24 గంటల సమయం ఇచ్చి ఆర్కే తరఫు న్యాయవాదులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. 

ముఖ్యమంత్రికి సమాచారం..
ఈ ఘటనతో బిత్తరపోయిన న్యాయవాదులు బయటకు వచ్చి టీడీపీ నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చారు. దీంతో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు రిటర్నింగ్‌ అధికారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తట్టుకోలేక ఆరుగంటల సమయంలో లోకేష్‌ నామినేషన్‌ ఆమోదించినట్టు ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నోటరీ ఎవరు చేసినా వారి పరిధిలోనే అభ్యర్థి సంతకం చేశారని నోటరీ చేయాలి. కానీ లోకేష్‌ నోటరీలో న్యాయవాది తన పరిధి దాటి లోకేష్‌ నివాసంలో తన ముందు సంతకం చేసినట్టు నోటరీ చేశారు. అయితే 1956 నోటరీ యాక్ట్‌ ప్రకారం సెక్షన్‌ 8, 8ఏ, 9 ప్రకారం అలా సంతకం చేయరాదని చట్టంలో ఉండడంతో న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి సైతం వైఎస్సార్‌సీపీ న్యాయవాదుల వాదనలో నిజం ఉండడంతో ఆమోదిస్తే ఇబ్బంది పడతానని ఐదుగంటల పాటు ఏ నిర్ణయం ప్రకటించలేదు. అనంతరం అనేక ఒత్తిళ్లతో ఆమోదించారు. పోలీసు ఏఎస్పీ, నార్త్‌జోన్‌ డీఎస్పీ రామకృష్ణ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్‌ అధికారితో ప్రత్యేకంగా మాట్లాడడం విశేషం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్కే నామినేషన్‌ ఆమోదించిన అనంతరం సతీష్‌ మాదల అనే యువకుడు వచ్చి ఆర్కే తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ హడావుడి చేశారు. టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి పసలేని ఆరోపణలతో ఆర్కేపై అక్కసు వెళ్లగక్కారు.

నామినేషన్‌ పత్రాలే చూసుకోలేనోడు ప్రజలనెలా పాలిస్తాడు
నామినేషన్‌ పత్రాలనే సరిగా చూసుకోలేని లోకేష్‌ ప్రజలను ఎలా పాలిస్తాడని ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి ప్రశ్నించారు. సామాన్యుల నామినేషన్‌ దరఖాస్తుల్లో చిన్న తప్పు దొర్లినా తిరస్కరించిన అధికారులు లోకేష్‌ నామినేషన్‌లో ఎందుకు తాత్సారం చేశారని నిలదీశారు. తమన్నా నామినేషన్‌ ఆమోదం పొందిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తప్పులున్న నామినేషన్‌ను వెంటనే తిరస్కరించకుండా ఎందుకు సమయం ఇచ్చారని నిలదీశారు. లోకేష్‌కు ఓటమి తప్పదని తెలిసే ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా లోకేష్‌ ఓటమి ఖాయమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement