నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

Published Fri, Jul 20 2018 1:40 AM

Gattu srikanth reddy commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఆశలు ఆవిరయ్యాయని.. వారిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా కేవలం 12 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. మిగిలి ఉన్న ఏడాదిలో లక్ష ఉద్యోగాల లక్ష్యం నెరవేరుతుందా అని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే మా ఉద్యోగాలు మాకొస్తాయని నాడు ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

టీఎస్‌పీఎస్సీ తప్పిదాలు నిరుద్యోగులకు శాపాలు
టీఎస్‌పీఎస్సీ 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్‌–2 పరీక్షలు, 2017లో నిర్వహించిన గురుకుల పరీక్షల్లో తప్పిదాలు జరగడంతో ఫలితాలు విడుదల కాలేదని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగులు ఉన్నత న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను తొలగించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.

కేవలం ఆర్భాటం కోసమే జూన్‌ 2 నాడు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తున్నారు తప్పా.. నిజంగానే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఇయర్‌ క్యాలండర్‌ ప్రకటిస్తామని కేసీఆర్‌ ప్రగల్భాలు పలికారని కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ నాలుగేళ్ల నుంచి నేటి వరకు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అనేక బహిరంగ సభల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగ ఖాళీలు లక్ష పైన ఉండగా.. ఈ నాలుగేళ్లలో మరో 50 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారన్నారు. ఈ రకంగా చూస్తే ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఖాళీలు సుమారు 1.50 లక్షలు అని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని శ్రీకాంత్‌ రెడ్డి డిమాండు చేశారు.


ఆందోళన బాట పడతాం
లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఆగస్టు 2న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ప్రఫుల్లా రెడ్డి, జి.రాంభూపాల్‌ రెడ్డి, బి.అనిల్‌ కుమార్, బి.సంజీవ రావు, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతా సాగర్, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌ రెడ్డి, రాష్ట్ర యూత్‌ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎన్‌.రవికుమార్, ఎస్‌ఈసీ సభ్యుడు బి.బ్రహ్మా నందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, వేముల శేఖర్‌ రెడ్డి , ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌ బాబు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement