ఉప్పొంగిన జనాభిమానం | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన జనాభిమానం

Published Sun, Sep 30 2018 4:18 AM

Grand welcome at every step of YS Jagan Padayatra - Sakshi

‘కష్టం తెలిసిన, కన్నీళ్ల విలువ ఎరిగిన మనిషి.. కల్మషమే ఎరుగని నాయకుడు.. ఆయనతో కలిసి అడుగేస్తేనే కావాల్సినంత బలమొచ్చింది.. అలాంటాయన ముఖ్యమంత్రి అయితేనే పేదల కడగండ్లు తీరతాయి.. అందుకే కలకాలం ఆయనే మా నాయకుడు కావాలనిపిస్తోంది..’  

‘మా కంట కన్నీళ్లొస్తుంటే.. ఆ బాబు దోసిట పట్టినట్టు స్పందించాడు.. ఆయనకు చెప్పుకుంటే చాలు మరో నాలుగు నెలల్లో కష్టాలన్నీ తీరిపోతాయని వచ్చాము.’ 
 – విజయగనరం జిల్లా ఎస్‌ కోట, గజపతినగరం నియోజకవర్గాల్లోని జన స్పందన. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జగన్‌ వస్తేనే రాష్ట్రంలో ప్రతి ఇంటికీ లక్షల్లో లబ్ధి కలిగే నవరత్నాలు అందుతాయని, ఆ మంచి రోజులు రావాలంటూ అశేష జనవాహిని ఆకాంక్షించింది. జననేతతో కలిసి అడుగులో అడుగేసింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 273వ రోజు శనివారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. ఎస్‌.కోట నియోజకవర్గం జామి మండలం కిర్ల నుండి పాదయాత్ర ప్రారంభించి జిడ్డేటివలస క్రాస్, గొడికొమ్ము, ఆలమండ క్రాస్, ఆలమండ సంత, లొట్లపల్లి క్రాస్, యాతపాలెం, కొత్త భీమసింగి మీదుగా పాత భీమసింగి వరకు కొనసాగించారు. పాదయాత్రలో ఆద్యంతం జన ప్రవాహమే. ఊర్లకు ఊర్లు కదలివచ్చాయి. వయోబేధం లేకుండా ప్రజలు తరలివచ్చారు. తమ ఊరికొచ్చిన నేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు మహిళలు పోటీపడ్డారు. హారతులు పట్టారు. దిష్టి తీశారు. యువత రెట్టించిన ఉత్సాహంతో తమ అభిమాన నేత చుట్టే తిరిగింది. ‘పక్కకు తప్పుకోండయ్యా.. మా రాజన్న బిడ్డను దగ్గరి నుంచి చూస్తాం’ అంటూ వృద్ధులు రోడ్డుపైకి వచ్చారు. నవరత్నాల భరోసా దక్కిన వివిధ వర్గాల వారు జగన్‌కు ఆత్మీయంగా స్వాగతం పలికారు. చిన్నా, చితక సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు.. ఏదైనా జగన్‌తో చెప్పుకోవాలన్న రీతిలో జనం భారీగా తరలివచ్చారు. ‘ఆ బాబు వస్తే మా ఆరోగ్యానికి ఢోకా ఉండదు’ అని ఆరోగ్యశ్రీ అందక ఆగచాట్లు పడుతున్న జయలక్ష్మి అనే మహిళ, ‘ఇక మంచి రోజులు వస్తున్నాయి’ అని 70 ఏళ్ల వృద్ధుడు పైడి పొదలయ్య ధీమా వ్యక్తం చేశారు.  
 
కామ్రేడ్స్‌కూ జగన్‌పైనే నమ్మకం 
సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు జగన్‌ను కలిశారు. జామిలో జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. ‘సమస్యను జగన్‌ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా పని జరుగుతుంది’ అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సుంకర గణేష్‌ అన్నారు. ఆయనతో వచ్చిన వాళ్లంతా డిగ్రీ, బీటెక్, ఎంటెక్‌ చదివిన వాళ్లే. తమ డిమాండ్ల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారట. అధికార టీడీపీ నేతలు తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. ప్రజలు ఏం చెప్పినా జగన్‌ వింటాడన్న నమ్మకంతో వచ్చామన్నారు. పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యమనే భావజాలమున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కూడా జగన్‌పై ఇంత నమ్మకం పెట్టుకోవడం విశేషమేనని జామికి చెందిన ఉపాధ్యాయుడు చంద్రకిశోర్‌ వ్యాఖ్యానించారు.  

అరచేతిలో ఆటోగ్రాఫ్‌.. వాట్సాప్‌లో హల్‌చల్‌ 
ఇంటర్‌ చదువుతున్న కళ్యాణి, డిగ్రీ పూర్తిచేసిన శ్రావ్య కలిసి జగన్‌ వద్దకు వచ్చారు. ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌ అన్నారు. ‘ఇదిగో అన్న నా అరచేతి మీద ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు’ అంటూ బయటకొచ్చిన ఆ యువతులు పది మందికి చూపించడం కన్పించింది. అరచేతిమీది ఆటోగ్రాఫ్‌ను సెల్‌ఫోన్‌ కెమెరాతో ఫోటో తీసి, దాన్ని ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులకు వాట్సాప్‌లో పంపి ఉప్పొంగి పోయారు. ‘ఇది కాబోయే సీఎం ఆటోగ్రాఫ్‌...’ అంటూ కొత్త బీమసింగి వద్ద రూప అనే యువతి పట్టరాని ఆనందంతో చెప్పింది. ‘మీ నాన్నగారు మాకు నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు. మీరు అంతకన్నా ఎక్కువే మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పథకాలు ప్రకటించారన్నా’ అని ఆలమండ మైనార్టీ సంఘం అధ్యక్షుడు షేక్‌పీర్‌ అన్నాడు. మీరొస్తేనే మా లాంటోళ్లకు న్యాయం జరుగుతుందని  ఉద్దండపాలెంకు చెందిన నిరుద్యోగి చింతాడ సాయికుమార్‌ అన్నాడు. అన్నమరాజుపేట యూత్‌ సభ్యులు నవరత్నాల పథకాలను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎల్‌ కోటకు చెందిన మామిడి తాండ్ర రైతులు, గంట్వాడ మండలం దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు ఎస్‌ జేసుదాసు జననేతకు వారి కష్టాలు వివరించారు. అందరి కష్టాలు ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  

టీమిండియాకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆసియా కప్‌ క్రికెట్‌ టైటిల్‌ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ‘ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్‌ చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement