గుజరాత్‌ పాలక పక్షానికి ఊహించని పరిణామం | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ పాలక పక్షానికి ఊహించని పరిణామం

Published Tue, Nov 14 2017 2:43 PM

Gujarat Adivasi Protests - Sakshi

సాక్షి, గాంధీనగర్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఊహించని ప్రతికూల పరిణామం ఎదురయింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 15 శాతం ఉన్న ఆదివాసీలు లేదా ఎస్టీ సర్టిఫికెట్‌ కలిగిన దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆడవుల్లో నివసించే గిరి జాతీయులకే కాకుండా రాబ్రి, భార్వడ్, చరణ్‌ కులస్థులకు కూడా ఎస్టీ హోదా కల్పించడం పట్ల వారు ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఇతరులకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వల్ల తమకు కేటాయించిన రిజర్వేషన్లు నీరుగారి పోతున్నాయని ఆరోపిస్తూ వారు రాష్ట్రంలో పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు.
 
ఈ అంశంపై రానున్న నవంబర్‌ 18వ తేదీన తాపి జిల్లాలోని వైరా వద్ద రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీనికి 29 ట్రైబల్‌ ఉప కులాల అధ్యక్షులు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆదివాసీలను సమీకరిస్తున్నారు. ఈ సమ్మేళనంలో తమ సమస్యను సమగ్రంగా చర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు ఆదివాసీల ఆందోళనకు అగ్ర భాగాన నిలుస్తున్న ‘సమస్త్‌ ఆదివాసి సమాజ్‌’ అధ్యక్షుడు ప్రదీప్‌ గరాషియా తెలిపారు. తాత ముత్తాతలు అడవుల్లో నివసించిన ఆదివాసీలకు 1956లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ హోదాను కల్పించింది. అంతకుముందు ఎప్పుడో తమ తాత ముత్తాతలు కూడా అడవుల్లో నివసించారంటూ, తమకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ ముందుకు వచ్చిన రాబ్రి, భార్వడ్, చరణ్‌ కులాల వారిని ఎస్టీల కింద గుర్తించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. 

రిజర్వేషన్ల విధానాన్ని విస్తరిస్తూ 2007లో, 2017, జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద ఆదివాసీల వారసులు ఎక్కడున్నా ఎస్టీ సర్టిఫికెట్‌ తీసుకోవచ్చనే వెసులుబాటును కల్పించింది. ఇంతకుమించి ఈ నోటిఫికేషన్ల వల్ల లాభనష్టాలేమిటో ఆదివాసీలు గ్రహించలేదు. మూడు నెలల క్రితం 68 మంది డిప్యూటి పోలీసు సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్లకు నియామకాలు జరిగాయి. వీటిని ఎస్టీలకే కేటాయించగా, వాటిలో 35 పోస్టులు రాబ్రి, భార్వడ్, చరణ్‌ కులస్థులకు లభించాయి. కొత్త నోటిఫికేషన్ల ప్రకారం వారికి ఎస్టీ హోదా లభించడమే అందుకు కారణం. 1956లో ఎస్టీ హోదాకు అనర్హులైన వీరికి ఇప్పుడు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నామని గ్రహించిన ఆదివాసీలు, వారి ఉపకులాలు ఇప్పుడు ఆందోళన బాటపట్టాయి. కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివాసీలను కూడా మంచి చేసుకోవడం కోసం 2007 నాటితోపాటు గత అక్టోబర్‌ 11వ తేదీన జారీ చేసిన తాజా నోటిషికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. 

ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే స్థానిక బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్లను రద్దు చేసిందని, ఎన్నికల అనంతరం ఒక్క రాబ్రి, భార్వడ్, చరణ్‌ కులస్థులకే కాకుండా ఇతర కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ఆదివాసీలు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. సకాలంలో ఆదివాసీల ఆందోళనను విరమింప చేయకపోతే రానున్న ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని బారుచ్‌ బీజేపీ ఎంపీ మన్‌సుఖ్‌ వాసవ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే దూరమైన పటీదార్లు, దూరం అవుతున్న ఠాకూర్లును ఎలా మంచి చేసుకోవాలనో అర్థం కాక తలపట్టుకు కూర్చున్న పాలక పక్ష బీజేపీకి ఆదివాసీల సమస్య మరింత తలనొప్పిగా తయారయింది. ఈ సమస్య పరిష్కారంలో  తాత్సారం జరిగితే తల బొప్పికట్టక తప్పదు! ఎందుకంటే రాష్ట్రంలో ఎస్టీలకు 27 అసెంబ్లీ సీట్లు రిజర్వై ఉన్నాయి. వాటిలో గత ఎన్నికల్లో 16 సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, బీజేపీ పది సీట్లను కైవసం చేసుకొంది. ఇప్పుడు 25 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.

Advertisement
Advertisement