గుజరాత్‌ ఫలితాలపై ‘పల్లీల’ ప్రభావం | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఫలితాలపై ‘పల్లీల’ ప్రభావం

Published Fri, Dec 8 2017 2:20 PM

 Gujarat Assembly Elections: Decoding the challenges BJP faces in rural belt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్‌ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్‌ శనివారం 9వ తేదీన, మలి విడత పోలింగ్‌ 14వ తేదీన జరుగుతున్న విషయం తెల్సిందే. ఇదివరకటిలాగే ఈ ఎన్నికల్లో కూడా పాటిదార్‌ కమ్యూనిటీ లేదా పటేళ్లు నిర్ణయాత్మక పాత్ర వహించనున్నారు. రాష్ట్ర జనాభా ఆరు కోట్ల మందిలో 14 నుంచి 16 శాతం వరకున్న పాటిదార్లు రాష్ట్ర ఓటర్లలో 15 శాతం ఉన్నారు. వారు గత రెండున్నర దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తూ వచ్చారు. ప్రభుత్వ విద్యా, ఉపాధి అవకాశాల్లో తమకూ పది శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2015లో భారీ ఎత్తున గుజరాత్‌లో ఆందోళన చేసినప్పటి నుంచి వారి వైఖరి మారిపోయింది. వారి డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించక పోవడమే అందుకు కారణం.

నాటి పాటిదార్ల ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌ పార్టీతో అవగాహనకు వచ్చి ఈ సారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పాటిదార్లకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన యువత కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ముందుకురాగా, వృద్ధతరం మాత్రం ఇప్పటికీ బీజేపీకే ఓటు వేయాలని భావివిస్తున్నట్లు పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఓట్ల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరకున్న పాటిదార్లు నేడు రాష్ట్రంలో భూస్వాములుగా చెలామణి అవుతున్నారు. ఆది నుంచి భూమిని నమ్ముకున్న వారిలోనూ ఉత్తాన పతనాలు ఉన్నాయి. కౌలు రైతుగా జీవితాలను ప్రారంభించిన పాటిదార్లు ధనిక రైతులుగా ఎదగడం, మళ్లీ పండించిన పంటలకు గిట్టుబాటు ధరరాక చితకిపోవడం, ఓబీసీల్లాగా తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేయడం వరకు దారి తీసిన పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాస్తవానికి ఉత్తర గుజరాత్‌కు చెందిన పాటిదార్‌లు 1950 ప్రాంతంలో సౌరాష్ట్రకు వలసపోయారు. అక్కడ చవగ్గా భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయాన్ని ప్రారంభించారు. 1956లో భూసంస్కరణల చట్టం రావడంతో ఒక్కసారిగా వారి జీవితాలే మారిపోయాయి. వారంతా భూ యజమానులుగా మారిపోయారు. అప్పటి వరకు చిరు ధాన్యాలు పండించిన వారు వేరుశెనగ పంటకు మళ్లారు. ఆ పంటలకు వారికి మంచి గిట్టుబాటు ధర రావడంతోపాటు మిగులు కూడా ఎక్కువే ఉండడంతో పాల డెయిరీ, నూనె, పిండి మిల్లులు లాంటి వ్యవసాయ పరిశ్రమలపై దృష్టిని కేంద్రీకరించారు. మరి కొందరు రైతుల వ్యవసాయ సాగుకు ఉపయోగించే పరికరాలు, మరికొందరు సిరామిక్స్, పంపులు తయారుచేసే ఇంజనీరింగ్‌ పరిశ్రమలను స్థాపించారు. వారి ఉత్తాన పతనాల్తో వేరు శెనగ పంటనే కీలక పాత్ర పోషించిందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అచ్యుత్‌ యాగ్నిక్‌ తెలిపారు. అయితే ధనిక రైతులకుగానీ, ధీరుభాయి అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు ఇక్కడ ఏమీ నష్టం వాటిల్ల లేదు. సన్న, చిన్నకారు, మధ్య తరగతి రైతులే ఎక్కువ దెబ్బతిన్నారు.

ఎప్పుడూ వంద కిలోల పల్లీలకు నాలుగువేల రూపాయలకు తక్కువగా కనీస మద్దతు ధర ఉండేది కాదు. వరుసగా గత మూడేళ్లుగా పల్లీల కనీస మద్దతుధర 3000 నుంచి 3200 రూపాయలను మించడం లేదు. అది కూడా అందరికి అందడం లేదు. వారంతా చమురు మిల్లులకు పల్లీలను అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు వాటికి 3,200 రూపాయల వరకు ధర పలికేది. పామాయిల్‌ లాంటి చమురు ఉత్పత్తులను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల పల్లి నూనెలకు కూడా దారుణంగా డిమాండ్‌ పడిపోయింది. పామాయిల్‌ దిగుమతి కారణంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల మార్కెట్‌లో పల్లి నూనె వాట 15 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. కేంద్రంలోని ప్రభుత్వాలు ప్రధానంగా ఇండోనేసియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని క్రమంగా తగ్గిస్తూ చివరకు పూర్తిగా ఎత్తివేయడం పల్లి నూనెపై ప్రధానంగా ప్రభావం చూపింది.

2005 సంవత్సరం వరకు పామాయిల్‌పై దిగుమతి సుంకం 80 శాతం ఉండగా, 2008 నాటికి పూర్తిగా ఎత్తివేశారు. రైతులు, దేశీయ చమురు మిల్లుల యజమానులు గొడవ చేయడంతో మళ్లీ పామాయిల్‌పై 15 శాతం వరకు దిగుమతి సుంకం విధించారు. ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల 1992-93 సంవత్సరంలో మనకు కావాల్సిన వంటనూనెలో 3 శాతాన్ని మాత్రమే దిగుమతి చేసుకోగా, ఇప్పుడు 75 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల మన దేశ రైతులు, మిల్లులు భారీగా నష్టపోయాయని భారత చమురు ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోపియేషన్‌’ అధ్యక్షుడు భారత్‌ మెహతా, పతంజలికి పల్లి నూనెను, స్నిక్కర్స్‌కు పల్లీలను సరఫరా చేసే ‘శ్రీయా పీనట్స్‌’ యజమాని దయాభాయ్‌ థూమర్‌ తెలిపారు.
పల్లి నూనెలో సగం రేటుకే మామాయిల్‌ రావడం వల్లనే దాని దిగుమతికి వ్యాపారులు ఎగబడుతున్నారు. ఇలాంటి దిగుమతులుపై కేంద్రంలోని వాణిజ్యశాఖ నియంత్ర లేకపోవడం ఓ పెద్ద కుంభకోణమని ఇటీవలనే కాగ్‌ కూడా కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు విధించిన విషయం తెల్సిందే. 2001లో అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజపేయి మలేసియా టూర్‌కు వెళ్లొచ్చి మలేసియా నుంచి వచ్చే పామాయిల్‌ నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పల్లీలకు ఎసరు మొదలయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ కూడా దిగుమతి సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెల దిగుమతులు కూడా పల్లి నూనెపై ప్రభావం చూపాయి. అయితే వాటి ప్రభావం దీనంత ఎక్కువగా లేదు.

ఈ రోజున భారత్‌ వంట నూనెల దిగుమతుల్లో నెంబర్‌ వన్‌ దేశంగా గుర్తింపు పొందింది. ఏడాదికి 70 వేల కోట్ల రూపాయల నూనెలను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. గుజరాత్‌లోని ఒక్క సౌరాష్ట్రలోనే 1400 చమురు మిల్లులు ఉన్నాయి. ఆ మిల్లుల యజమానులను ‘తేలియా రాజాస్‌’, అంటే ఆయిల్‌ కింగ్స్‌ అని పిలిచేవారు. 1980, 1990వ దశకాల్లో వారే గుజరాత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించేవారని సౌరాష్ట్ర చమురు మిల్లుల అసోసియేషన్‌ సంఘం మాజీ అధ్యక్షుడు ఉకాభాయ్‌ పటేల్‌ తెలిపారు. వాటిలో దాదాపు 500 మిల్లులు మూతపడ్డాయి. వారంతా రోడ్డున పడ్డారు. పండించిన పల్లీలకు గిట్టుబాటు ధర లేక రైతులు కూడా రోడ్డున పడ్డారు. వారిలో 96 శాతం మంది పాటిదార్లే అవడం వల్ల వారు 2015లో రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కారు. గుజరాత్‌లో ఒకప్పటికి ఇప్పటికీ 60 లక్షల టన్నుల పల్లీల ఉత్పత్తి పడిపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement