మూడు రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకోదు | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకోదు

Published Thu, Feb 6 2020 4:30 AM

GVL Narasimha Rao Comments On Three Capitals - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేసిందని అన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వక్రీకరణలు మానుకోవాలని సూచించారు. జీవీఎల్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో ముఖ్యంగా మూడే వాక్యాలున్నాయని చెప్పారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్ణయిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 23న ఒక జీవో ద్వారా నోటిఫికేషన్‌ వెలువరించిందనేది మొదటి వాక్యమని అన్నారు.

ఆ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి రాజధాని గురించి తెలియజేయలేదని అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా తీసుకున్న నిర్ణయం కాబట్టి కేంద్రానికి తెలపాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రాజధాని మార్పు గురించి గానీ, మూడు రాజధానుల గురించి గానీ తమకు ఇంకా సమాచారం లేదన్నదే హోంశాఖ సమాధానంలోని రెండో వాక్యమని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది మూడో వాక్యమని వివరించారు. అంటే రాజధానిని ఎక్కడ స్థాపించుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టంగా తేల్చిచెప్పిందని వెల్లడించారు. అందుకే అమరావతి విషయంలో గానీ, మూడు రాజధానుల విషయంలో గానీ కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని ఉద్ఘాటించారు. అమరావతి ప్రాంత ప్రజలను  మభ్యపెట్టడం కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవీఎల్‌ విమర్శించారు.  

ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ కొనసాగించాలంటే...  
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే.. పదేపదే ఈ డిమాండ్‌ లేవనెత్తితే జగన్‌ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధల ప్రకారం నడుచుకుంటుందని తెలిపారు.   

అది కూడా భ్రమలో భాగమే... 
2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మనకున్న ఫెడరల్‌ వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో అక్బర్‌ శిలా శాసనమో, చంద్రబాబు నాయుడు చెక్కిన శిలా ఫలకమో కాదని తేల్చిచెప్పారు. దానిపై కొత్త జీవో జారీ చేసే అధికారం ఎవరికీ లేదని అనుకుంటే అది కూడా భ్రమలో భాగమేనని చెప్పారు. కొత్త ప్రభుత్వం నిబంధనలకు లోబడి మరో జీవో జారీ చేయవచ్చని తెలిపారు.  

Advertisement
Advertisement