కాంగ్రెస్‌ గురించి మాట్లాడుకోవడం దండగ  | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గురించి మాట్లాడుకోవడం దండగ 

Published Sat, Mar 23 2019 1:15 AM

Harish Rao Comments On BJP And Congress - Sakshi

సాక్షి, మెదక్‌: ‘కాంగ్రెస్‌ చతికిలబడింది.. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా దండగే’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే నమ్మడం లేదని.. రోజుకో నాయకుడు పార్టీని వదిలిపోతుండడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కలెక్టరేట్‌లో హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులతో కలసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్‌ నేతలు చేతులెత్తేశారని విమర్శించారు.

బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదు.. 
మెదక్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేసేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకడం లేదని హరీశ్‌ అన్నారు. బీజేపీ ఇప్పటివరకు కనీసం అభ్యర్థిని కూడా ప్రకటించలేదని.. ఎవరు దొరుకుతారా.. అని ఎదురుచూసే పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడిందని పేర్కొన్నారు. మెదక్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పోటీ లేదని.. మెజార్టీ తెలుసుకోవడానికే ఈ పోటీ జరుగుతోందని అన్నారు. ఏపార్టీకి ఓటు వేయాలో ప్రజలకు స్పష్టత ఉందన్నారు. ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఎలా ఓటు వేశారో.. అదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

నిర్ణయాత్మక శక్తిగా టీఆర్‌ఎస్‌.. 
రాష్ట్రంలో గత 30, 40 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఈ ఐదేళ్ల్లలోనే జరిగిందని హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నిర్ణయాత్మక శక్తిగా మారనుందని అన్నారు. రేపు ఢిల్లీలో ఎవరు ప్రధాని కావాలన్నది టీఆర్‌ఎస్‌ పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏనాడూ సహకరించలేదన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధిపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణలో ‘జాతీయ ప్రాజెక్ట్‌’కావాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే.. కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయాత్మకంగా ఉండేలా ప్రజలు దీవించాలని హరీశ్‌రావు కోరారు.  

Advertisement
Advertisement