భరతమాత ముద్దుబిడ్డ | Sakshi
Sakshi News home page

భరతమాత ముద్దుబిడ్డ

Published Fri, Aug 17 2018 4:39 AM

india pride atal bihari vajpayee - Sakshi

రాజకీయవేత్తగా..
ఒప్పుకోను పరాజయం కొత్తదారి నా ధ్యేయం
కాలం తలరాతను చెరిపేస్తా
సరికొత్త గీతాన్ని ఆలపిస్తా
తెగి పడగలం... కానీ తల వంచం
పాలకులతో పేచీ
నిరంకుశంపై తిరుగుబాటు
అంధకారంతో లడాయి
వెలుతురు కోసం పెనుగులాట
తెగి పడగలం గాని తల వంచం....  
కవిగా, రాజకీయవేత్తగా వాజ్‌పేయి ధోరణి ఇదే

కవిగా...
బాధలు చుట్టుముట్టనీ
ప్రళయం కరాళనృత్యం చేయనీ
కాళ్ల కింద భూమి కదలనీ
శిరస్సు మీద అగ్నివాన కురవనీ
ఆగొద్దు... కలసి నడవడం ఆపొద్దు
 

దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర!
అబ్బురపరిచే వాగ్ధాటి.. అచంచల ఆత్మవిశ్వాసం.. రాజకీయ చతురత..
రాజనీతిజ్ఞతకు చిరునామాగా నిలిచిన ఆయన ప్రతి అడుగూ ఓ మైలురాయే!!


పోఖ్రాన్‌ అణు పరీక్షలైనా దాయాది దేశం
పాకిస్తాన్‌తో శాంతిచర్చలైనా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగారు. మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆయన.. గొప్ప కవి కూడా. నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టగానే ఆయనకు భారతరత్న ప్రకటించారు. వాజ్‌పేయి జన్మదినాన్ని(డిసెంబర్‌ 25) కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది.

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి..
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్‌పేయి దంపతులకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్‌ 25న ఆయన జన్మించారు. వాజ్‌పేయి తండ్రి కృష్ణ స్కూల్‌ టీచర్‌. కవి కూడా. గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్‌ విద్యాలయంలో వాజ్‌పేయి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత గ్వాలియర్‌లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్‌లోని దయానంద్‌ ఆంగ్లో–వేదిక్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1939లో ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చురుగ్గా పాల్గొన్నారు. హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్‌ అర్జున్‌లలో పని చేశారు.

రాజకీయ ప్రస్థానం
ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయి రాజకీయ రంగంలో ఒక్కో మెట్టు అధిష్టించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన అప్పటి హిందూత్వ పునాదులపై డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్‌(బీజేఎస్‌)లో చేరారు. అనతికాలంలోనే పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 1957లో బలరాంపూర్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్‌ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు.

అప్పట్నుంచి తన సహచరులు నానాజీ దేశ్‌ముఖ్, బల్‌రాజ్‌ మధోక్, ఎల్‌కే అద్వానీలతో కలసి పార్టీని కొత్త తీరాలకు తీసుకువెళ్లారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్‌ నేతృత్వంలో ఉధృతంగా సాగిన సంపూర్ణ విప్లవోద్యమంలో వాజ్‌పేయి చురుగ్గా పాల్గొన్నారు. 1977లో జనసంఘ్‌ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో జనతా సర్కారు కొలువుదీరింది.  అందులో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు. 1979లో మొరార్జీ దేశాయ్‌ తన పదవికి రాజీనామా చేయడంతో వాజ్‌పేయి కేంద్రమంత్రిగా కొద్దికాలం పాటే పనిచేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే గొప్పనేతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

3 సార్లు ప్రధాని పీఠం..
1984 ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి తన సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ పదో ప్రధానిగా వాజ్‌పేయి ప్రమాణం చేశారు. అయితే మిత్రపక్షాలు సహకరించకపోవడంతో బలపరీక్షలో ఓడిపోయి 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత 1998లో మిత్రపక్షాలను కూడగట్టిన బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ సమయం(1998 మే)లోనే ఆయన రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు. మరోవైపు పాక్‌తో శాంతిచర్చలకు శ్రీకారం చుట్టారు.

1999లో ఢిల్లీ–లాహోర్‌ మధ్య చరిత్రాత్మక బస్సు సర్వీసును ప్రారంభించారు. కానీ పాక్‌ కయ్యానికి కాలుదువ్వి కార్గిల్‌ వార్‌కు కారణమైంది. ఆ యుద్ధంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో పాక్‌ సైనికులను సరిహద్దుల నుంచి తరిమేసి జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తికాలంపాటు ప్రభుత్వాన్ని నడపలేదు. మిత్రపక్షం అన్నా డీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించింది. 1999 అక్టోబర్‌ 13న వాజ్‌పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999–2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

సంస్కరణల బాటలో..
మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్‌పేయి కీలక ఆర్థిక సంస్కరణలకు బాటలు వేశారు. విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలతో ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన పథకాన్ని చేపట్టారు. అమెరికా–భారత్‌ మధ్య స్నేహబంధం బలోపేతమైంది. 2000 మార్చిలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ భారత్‌ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనే  ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజాలు వేస్తూ అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

అమెరికాకు దగ్గరవుతూనే పాక్‌కు స్నేహహస్తం చాచారు వాజ్‌పేయి. అప్పటి పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌తో ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కశ్మీర్‌ అంశంపై ముషార్రఫ్‌ పట్టుపట్టడంతో ఇరుదేశాల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు ఉగ్రవాదం కూడా వాజ్‌పేయి సర్కారుకు సవాలుగా నిలిచింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మూడునెలలకే.. అంటే 1999 డిసెంబర్‌లో కాందహార్‌లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేశారు. ప్రయాణికులను ముష్కర చెర నుంచి విడిపించేందుకు జైల్లో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్‌ అజార్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అలాగే 2001 డిసెంబర్‌ 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. 2002లో గుజరాత్‌లో గోధ్రా ఘటనతో అల్లర్లు చెలరేగాయి.

బీజేపీకి బీజాలు
1980లో అద్వానీ, భైరాన్‌సింగ్‌ షెకావత్‌ తదితరులతో కలసి వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించారు. జనతా సర్కారు తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌(ఐ) ప్రభుత్వంపై వాజ్‌పేయి సునిశిత విమర్శలతో విరుచుకుపడేవారు. 1984లో ఇందిర హత్య అనంతరం సిక్కుల ఊచకోత సమయంలో ప్రభుత్వ తీరును, అది చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ను తీవ్రంగా ఖండించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండే రెండు స్థానాలను గెల్చుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుతూనే  లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి తన వాణిని బలంగా వినిపించారు. ఉదారవాదిగా గుర్తింపు పొందిన ఆయన 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘అనాలోచిత చర్య’గా అభివర్ణించారు.

అవార్డులు
1992: పద్మవిభూషణ్‌
1994:లోకమాన్య తిలక్‌ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు, గోవింద్‌ వల్లభ్‌పంత్‌ అవార్డు
2015: భారతరత్న


రాజకీయాల నుంచి నిష్క్రమణ
2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమిపాలైంది. యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టేందుకు వాజ్‌పేయి నిరాకరించారు. పార్టీ బాధ్యతలను అద్వానీకి అప్పగించారు. 2005 డిసెంబర్‌లో ముంబైలో జరిగిన బీజేపీ సిల్వర్‌జూబ్లీ ర్యాలీలో క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్నుంచి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
సాక్షి, తెలంగాణ డెస్క్‌

1/5

చిన్ననాటి వాజ్‌పేయి

2/5

యుక్త వయసులో..

3/5

కుటుంబంతో...

4/5

నాటి ప్రధాని ఇందిరతో..

5/5

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌తో...

Advertisement
Advertisement