చేయిచేయి కలుపుతూ.. | Sakshi
Sakshi News home page

చేయిచేయి కలుపుతూ..

Published Sat, Nov 11 2017 9:27 AM

jagan 5th day padayatra - Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర  ఐదో రోజు వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి శనివారం ఉదయం ప్రారంభమయింది. పాదయాత్ర చేస్తున్న  వైఎస్‌ జగన్‌తో కలిసి వందల సంఖ్యలో యువత అడుగు కలిపింది. రాజన్న రాజ్యం.. జగనన్న లక్ష్యం అంటూ యువత పాదయాత్రలో పాల్గొంది.

ఒక్కమాట జగనన్నా..!
పాదయాత్ర సాగుతున్న సమయంలో చిన్నా, పెద్దా, ఆడ, మగా అన్న తేడాలేకుండా అంతా వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, పలకరించుందుకు తాపత్రయపడ్డారు. చిన్నారులు, కాలేజీ విద్యార్థినులు, మహిళలు వైఎస్‌ జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు తాపత్రయపడ్డారు. అందరినీ పలకరిస్తూ.. క్షేమ సమాచారాలు ఆరా తీస్తూ..  వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.

చేయిచేయి కలుపుతూ..!
వైఎస్సార్‌ జిల్లాలో సాగుతున్న వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు పార్టీ కార్యకర్యలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. పాదయాత్ర సందర్భంగా రోడ్డుకిరువైపులా జనాలు జగన్‌ కోసం ఎదరు చూస్తూ నిలబడ్డారు. వైఎస్‌ జగన్‌తో మాట్లాడేందుకు, చేయికలిపేందుకు ప్రజలు ఉత్సాహం ప్రదర్శించారు. అందరితో చేయికలుపుతూ, పలకరిస్తూ.. చిన్నారులను హృదయానికి హత్తుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.

చిన్నారులతో జగన్‌ సెల్ఫీ
పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు చిన్నారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో ఇది గమనించని జగన్‌.. అడుగులు ముందుకేస్తూ వెళ్లారు. రెండడుగుల తరువాత చిన్నారులను గమనించిన జగన్‌.. వారిని దగ్గరకు తీసుకుని.. వారితో ముచ్చట్లాడి.. సెల్ఫీ తీసుకుని చిన్నారులను ఆనందంలో ముంచెత్తారు.

ఈ ప్రభుత్వంతో ఇబ్బందులు : ప్రజలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు పాదదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌కు వివరించారు. రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మాఫీ చేయలేదని.. బ్యాంకుల్లో తమను ఇబ్బంది పెడుతున్నట్లు రైతులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

ట్రాఫిక్‌ మళ్లింపు
ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. దీంతో ప్రొద్దుటూరులో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

మమ్మల్ని బాబు మోసం చేశాడు : కాంట్రాక్ట్‌ లెక్చరర్లు

కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారంకి వస్తే తమను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మమ్మల్ని నట్టేట ముంచాడని కాంట్రాక్టు లెక్చరర్లు వైఎస్‌ జగన్‌కు చెప్పారు. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని కాంట్రాక్టు లెక్చరర్లు తమ ఆవేదన వైఎస్‌ జగన్‌తో చెప్పుకున్నారు. నేను అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టు లెక్చరర్లు ఆనందంతో చెప్పారు. వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు తమ మద్దు పూర్తిగా ఉంటుందని కాంట్రాక్టు లెక్చరర్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులు సైతం పాదయాత్ర మధ్యలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వీఆర్‌ఏ ప్రతినిధులు  వైఎస్‌ జగన్‌తో ప్రస్తావించారు.

Advertisement
Advertisement