టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసుగెత్తారు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసుగెత్తారు

Published Mon, Sep 24 2018 1:38 AM

Jaipal reddy commented over trs and kcr - Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనను చూసి తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయ మని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన లంబాడీ గర్జన లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్‌ వల్లే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను ఓబీసీ నుంచి ఎస్టీలుగా గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు. ఇందిరా గాంధీ వల్లే గిరిజను లంతా ఎస్టీ జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయా ల్సిన సీఎం కేసీఆర్‌ ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. గిరిజన తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తే సరిపోదని, వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తేనే గిరిజనులు అభివృద్ధి చెందుతారన్నారు.  

గిరిజనులే తగిన బుద్ధి చెబుతారు  
ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కేసీఆర్‌కు గిరిజనులే తగిన బుద్ధి చెబుతారని జైపాల్‌రెడ్డి అన్నారు. లంబాడీలకు, ఆదివాసీలకు మధ్య కేసీఆర్‌ చిచ్చుపెట్టారని, వారి మధ్య జరిగిన గొడవ తమకేమీ తెలియనట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగున్నరేళ్ళలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.

గిరిజన తండాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల మాయమాటలను నమ్మొద్దని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సభలో నాయకులు అగ్గునూరు విశ్వం, యాదయ్య యాదవ్, కట్టా వెంకటేశ్‌గౌడ్, శివశంకర్‌గౌడ్, దంగు శ్రీనివాస్‌ యాదవ్, రాజునాయక్, గోపాల్‌ నాయక్, మహమూద్‌బేగం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement