‘అమెరికాలో పరువు తీసిన లోకేష్‌’ | Sakshi
Sakshi News home page

‘అమెరికాలో పరువు తీసిన లోకేష్‌’

Published Mon, Feb 5 2018 4:12 PM

'Lokesh who is defamed ap digninity in America - Sakshi

కృష్ణా జిల్లా :  అమెరికాలో టీడీపీ అధికారంలోకి వస్తుందని లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందని, లోకం తెలియని లోకేష్ అమెరికాలో మన పరువు తీశాడని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తన కుమారుడు నారా లోకేష్‌కి  కాస్త జ్ఞానం నేర్పాలని సూచించారు.మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అసమర్ధ ముఖ్యమంత్రి పాలన చేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా మీ మోసపూరిత మాటలు వినీ వినీ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు.
 
ప్రత్యేక హోదా భిక్ష కాదని, మన ఆంధ్రుల హక్కు అని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ నాటకాలు ఆడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులను ఉద్ధేశించి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం యువత, విద్యార్థులు గళమెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.  బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ప్రశ్నలకు చంద్రబాబు డక్ ఔట్ అయ్యాడని, దీంతో ఎక్స్‌ట్రా ప్లేయర్స్ బుద్దా వెంకన్న, కాల్వ శ్రీనివాసులని రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలక ముందు రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు రూ. 2 లక్షల కోట్లు ఎలా సంపాదించారని నేరుగా ప్రశ్నించారు.

మీ మిత్ర పక్ష నేత సోము వీర్రాజు ప్రశ్నలకు ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు బదులు టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారని, బుద్దా వెంకన్న కాదు బుద్ది లేని వెంకన్న అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు బయటికి వచ్చి సమాధానం చెప్పాలని లేదంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని అప్పుడే..నిజాలు బయటికి వస్తాయని వ్యాఖ్యానించారు.

సోము వీర్రాజు చెప్పిన మాటలు అక్షర సత్యమని, తాము ఇదే విషయం ఎప్పుడో చెప్పామని వెల్లడించారు. బడ్జెట్ పై టీడీపీ నేతలు  డ్రామాలు ఆడుతున్నారని గట్టిగా మాట్లాడితే బీజేపీ నాయకులు, టీడీపీ నేతలకు  జైల్లో పెడతారనే భయం చుట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎంపీలతో మీటింగ్ అంటూ పార్లమెంట్ బయట డ్రామాలు ఆడారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సోము వీర్రాజు ఆరోపణలకు చంద్రబాబు వెంటనే బయటికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement