ఈ తీర్పు అన్యాయం | Sakshi
Sakshi News home page

ఈ తీర్పు అన్యాయం

Published Tue, Apr 17 2018 1:31 AM

Justice not done in Mecca Masjid bomb blast case  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు నూటికి నూరుపాళ్లు అన్యాయమైనదని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రాజకీయ జోక్యానికి తలొగ్గి, కేసును నీరుగార్చిందని ఆరోపించారు. సోమవారం మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు అనంతరం.. మజ్లిస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షుల్లో అత్యధిక భాగం ప్రతికూలంగా మారిపోయారు. కీలక సాక్షులు మాటమార్చారు. ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అసలు ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తును సరిగా ముందుకు తీసుకెళ్లలేదు. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజులలోపే బెయిల్‌ వచ్చినా దానిని సవాల్‌ చేయలేదు. ఎన్‌ఐఏ రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండా పోయే ప్రమాదముంది..’’అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్‌ఐఏ వ్యవహరించాయని ఆరోపించారు. పేలుళ్లలో మరణించినవారి కుటుంబాలకు న్యాయం దక్కలేదన్నారు.

కర్ణాటకలో జేడీఎస్‌కు మద్దతిస్తాం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, జేడీఎస్‌కు మద్దతిస్తామని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని.. అభివృద్ధి జరగాలంటే బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. అందుకోసమే జేడీఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామని.. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటామని చెప్పారు. అవసరమైతే జేడీఎస్‌ తరఫున బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 

Advertisement
Advertisement