‘ఈ సభ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది’ | Sakshi
Sakshi News home page

‘ఈ సభ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది’

Published Sun, Sep 2 2018 7:12 PM

Kadiyam Srihari Speech At Pragathi Nivedana Sabha In Kongara Kolan - Sakshi

సాక్షి, కొంగర కొలాన్‌: ప్రగతి నివేదన సభ భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. వ్యవసాయాన్ని పనిగా చేయాలి, రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చి, రైతు బంధు, రైతు భీమా ద్వారా రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు.

నాలుగు సంవత్సరాల మూడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశామంటే అది కేసీఆర్‌ పరిపాలన దక్షత వల్లనే అన్నారు. నూతన రాష్ట్రమైనప్పటికీ.. కేసీఆర్‌ కృషి వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, హరితహారం, కంటివెలుగు వంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయడమే కాకుండా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వందకు వంద శాతం నెరవేర్చి.. మేనిఫెస్టోలో లేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు.  రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు లేని పరిపాలన కొనసాగుతోందని , రాబోయే రోజుల్లో మరోక్కసారి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలని కడియం కోరారు.

Advertisement
Advertisement