సోమిరెడ్డి.. నీవు చాలదన్నట్లు లోకేష్‌ను తీసుకొచ్చావా? | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి.. నీవు చాలదన్నట్లు లోకేష్‌ను తీసుకొచ్చావా?

Published Sat, Nov 16 2019 7:45 AM

Kakani Says Somireddy Is Making False Allegations - Sakshi

సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వాస్తవాలు కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు తాను అడిగే ఏ ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందాని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు విషయాలను ప్రస్తావించి, వాటిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలుగా ఆరోపించారన్నారు.
 
వాస్తవాలు ఇవే సోమిరెడ్డి 
కూరపాటి విజయరాజును ప్రభుత్వం రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తుందని తాము బెదిరిస్తున్నట్లుగా చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారన్నారు. కానీ వాస్తవంగా విజయరాజుపై గతంలో ఎనిమిది కేసులు ఉండడంతో ఈ ఏడాది జనవరిలోనే  పోలీసులు రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారని తెలిపారు. జనవరిలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న విషయాన్ని సోమిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. గతేడాది అక్టోబరు 26న  అసైన్‌మెంటు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా చెన్నారెడ్డిపల్లికి చెందిన ఎస్టీ సగుటూరు శీనయ్యకు సంబంధించిన పొలానికి పట్టా ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. కానీ సోమిరెడ్డి మాత్రం అధికారికంగా చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి, ఎస్టీ అని కూడా చూడకుండా వేరొకరికి పట్టా ఇవ్వాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం ఈ విషయమై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అట్రాసిటీ కేసులు ఎన్నడూ చూడలేదన్న చంద్రమోహన్‌రెడ్డి వాస్తవం తెలుసుకోవాలన్నారు.

బిరదవోలుకు చెందిని బుజ్జిరెడ్డిపై గత ఏడాది నవంబరులో అట్రాసిటీ కేసు పెట్టించగా, కోర్టు తప్పుడు కేసు అని కొట్టివేసిన విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెట్టించిన తప్పుడు అట్రాసిటీ కేసులపై  ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తోడేరుకు చెందిన ఓ వ్యక్తి ట్రాలీలో ఆవులను తీసుకుపోతుంటే పోలీసులు అమానుషంగా కొట్టారని సోమిరెడ్డి మరో అసత్య అరోపణ చేశారన్నారు. ట్రాలీలో ఆవులను తీసుకువెళ్తున్న సమయంలో కలెక్టర్‌ అటువైపుగా వెళుతూ గమనించి పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు పిలిపించి ఆవుల విక్రయాలు చేయెద్దని చెప్పి పంపారన్నారు. ఈ విషయాన్ని ఎవరైనా పోలీసులను అడిగి తెలుసుకోవచ్చన్నారు. సోమిరెడ్డి అసత్య అరోపణలు చేస్తూ వైఎస్సార్‌సీపీపై నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ అరోపణలన్నీ గత ప్రభుత్వంలోనే జరిగిన విషయాలేనని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. ఈ విషయాలపై సోమిరెడ్డికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 

బహిరంగ చర్చకు సిద్ధమా? 
సోమిరెడ్డి నీవు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వచ్చారన్నారు. తప్పుచేస్తే ఎవరైనా ఒక్క టేనని, తప్పుచేసిన వారిని ఎవరైనా వదలేది లేదన్నారు. సోమిరెడ్డిలాగా దిగజారుడు మాటలు, పనులు చేసే సమయం తమకు లేదన్నారు. తమకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలకే సమయం సరిపోవడంలేదన్నారు. 

నీవు చాలదన్నట్లు లోకేష్‌ను తీసుకొచ్చావా 
సోమిరెడ్డి తాను చేసే ఆరోపణలు, అసత్య ప్రకటనలు చాలవన్నట్లు లోకేష్‌ను నెల్లూరుకు తీసుకొచ్చారన్నారు. దగదర్తిలో కుటుంబ కలహాలతో వ్యక్తి చనిపోతే వైఎస్సార్‌సీపీకి అంటగట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో గత ప్రభుత్వంలో నీరు–చెట్టులో ఏ మేర అవినీతి జరిగింది..అందులో తనకు ఎంత వాటా రావాలి..ఎంత ఇచ్చారో లోకేష్‌ సమీక్ష చేసి అడిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. శవాలకు డబ్బులు ఇచ్చి శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.   

Advertisement
Advertisement