Sakshi News home page

సిగ్గులేకుండా కాంగ్రెస్‌తో పొత్తా: కన్నా

Published Thu, Sep 13 2018 4:18 AM

Kanna Lakshminarayana fires on Chandrababu Alliance With Congress - Sakshi

సాక్షి, గుంటూరు/సాక్షి, అమరావతి: దేశానికి పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ అంటూ గతంలో ఆ పార్టీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి జెండాను లాక్కున్నారని, అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. హోదా విషయంలో చంద్రబాబు ఎన్ని టర్నులు తీసుకున్నారో అందరికీ తెలుసన్నారు.

ఎన్నికల ముందు లీటరు పెట్రోలుపై రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.4 క్యాపిటల్‌ ట్యాక్స్‌ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్వయంగా తనపై సీబీఐ విచారణ వేసుకున్నారని, చంద్రబాబు అలా చేయగలరా అని కన్నా సవాల్‌ చేశారు. సీబీఐ విచారణలో చంద్రబాబు అవినీతి బయటపడకపోతే తాము జైలుకు వెళతామని చెప్పామని, ఇప్పటికైనా సవాల్‌ను స్వీకరించాలన్నారు. అప్పు చేసిన చంద్రబాబు భయపడాలి కానీ, ఓ డ్రామా కంపెనీని చూసి బీజేపీ భయపడదన్నారు. 

కామాంధ్రగా మార్చేశారు
మహిళా ఉద్యోగులకు సెలవు కావాలన్నా.. బదిలీ కావాలన్నా.. ప్రమోషన్‌ కావాలన్నా లైంగిక వేధింపులు తప్పని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చేస్తానని చెప్పి కామాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రతి వారం ఐదు ప్రశ్నలతో గత 11 వారాలుగా ఆయన ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్న సంగతి విదితమే. బుధవారం మరో ఐదు ప్రశ్నలతో ఆయన సీఎంకు లేఖ రాశారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామని కథలు చెబుతూ ముఖ్యమంత్రిగా మీరు మాత్రం ప్రజల డబ్బులను సొంత ఆర్భాటాలకు పప్పూ బెల్లాల్లా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు.

నరసరావుపేట జేఎన్‌టీయూలో రెండు గంటల కార్యక్రమానికి రూ.45 లక్షలు ఖర్చు పెట్టారని, అందులో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకే రూ.35 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎంత చెల్లించిందో వెల్లడించగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి భారత పౌరసత్వమే లేని వ్యక్తిని సీఈవోగా నియమించడం ఎంతవరకు సబబన్నారు. భూ కేటాయింపుల్లో అక్రమాలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ టెండర్లు రద్దు కుంభకోణం.. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement