‘2019’పై ప్రభావమెంత? | Sakshi
Sakshi News home page

‘2019’పై ప్రభావమెంత?

Published Wed, Mar 28 2018 1:56 AM

Karnataka assembly elections effect on 2019 elections - Sakshi

కర్ణాటక ఎన్నికలతో దేశ రాజకీయ ముఖ చిత్రంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటములే దేశ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల భవిష్యత్‌ రాజకీయ వ్యూహాలకు, 2019 ఎన్నికల ప్రణాళికకు, కూటముల ఖరారుకు ప్రామాణికం కానున్నాయి. ఈ ఏడాదే జరగబోయే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికల్లోనూ కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుంది.

బీజేపీ గెలిస్తే..?
ఇటీవలి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన బీజేపీకి కర్ణాటక ఎన్నికలు కీలకమైనవి. దేశంలో ప్రధాని మోదీ హవా తగ్గలేదని నిరూపించాలంటే కర్ణాటకలో గెలిచి తీరాల్సిందే. ఇక్కడి విజయంతో బీజేపీ మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పోటీలో ఇతర పార్టీల కన్నా ముందుంటుంది. మోదీ–అమిత్‌ షా ద్వయానికి తిరుగులేదని మరోసారి చాటుతుంది. ప్రస్తుతం బీజేపీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న శివసేన కూడా తన వైఖరిని మార్చుకోవచ్చు.

గెలుపు కోసం బీజేపీ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో అనుసరించిన వ్యూహాలనే కర్ణాటకలోనూ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉన్న కుటుంబాలు, ఆ ఇళ్లలోని ఓటర్లు, వారి వయసు, ఉద్యోగులా, నిరుద్యోగులా, కులమతాలు, ఆ ప్రాంతంలోని ఆలయాలు, మసీదుల సంఖ్య, పూజారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఆయా ప్రాంతాల్లోని ఇతర ప్రముఖులు తదితర వివరాల సేకరణకు అమిత్‌ షా ఆదేశాలతో ఇప్పటికే పని ప్రారంభమైంది.

మరోవైపు కొత్తగా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ సమర్థతపై బీజేపీ విజయంతో సందేహాలు వ్యక్తమవుతాయి. విపక్షాల ఉమ్మడి శత్రువు బీజేపీని ఓడించేందుకు మిత్ర పక్షాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ ఇప్పటికే సర్వ శక్తులూ ఒడ్డుతోంది. కర్ణాటకతోపాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కూడా కాంగ్రెస్‌ గెలిస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ఆ పార్టీ ఆశలు సజీవంగా ఉంటాయి. కాంగ్రెస్‌ ఓడితే.. మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న రాహుల్‌ ఆశలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీళ్లు చల్లడం ఖాయం.  

కాంగ్రెస్‌ విజయం సాధిస్తే..
తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో విజయం నూతన ఉత్సాహాన్నిస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 10 శాతం సీట్లు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్‌.. ఆ తర్వాతా అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. కర్ణాటకను మినహాయిస్తే కేవలం పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరిలలో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. బీజేపీని నిలువరించాలంటే జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటే మార్గమని నమ్ముతోంది.

ఇందుకు తొలి అడుగుగా ఇటీవలే కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విందుకు 20 విపక్ష పార్టీల నేతలు హాజరవడం తెలిసిందే. కర్ణాటకలో గెలిస్తే మహా కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహించే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ ముందుగానే ప్రకటించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించడం సత్ఫలితాలను ఇవ్వొచ్చని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.  

హంగ్‌ వస్తే...: కర్ణాటకలో మరో కీలక పార్టీ జేడీఎస్‌. ఈసారి అధికారం తమదేనని ఆ పార్టీ నేత కుమారస్వామి బలంగా నమ్ముతున్నారు. దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే బీఎస్పీతో జేడీఎస్‌ చేతులు కలిపింది. కానీ జేడీఎస్‌ ‘కింగ్‌’ కాలేదు కానీ.. ‘కింగ్‌ మేకర్‌’ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హంగ్‌ ఏర్పడే పరిస్థితులు నెలకొంటే.. జేడీఎస్‌ కీలక భూమిక పోషిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని కుమారస్వామి స్పష్టం చేశారు.    –నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement