సిద్ధరామయ్య పాకిస్తాన్‌ వెళ్లారా..? | Sakshi
Sakshi News home page

సిద్ధరామయ్య పాకిస్తాన్‌ వెళ్లారా..?

Published Wed, May 2 2018 10:48 AM

Karnataka CM Siddaramaiah Went To Pakistan Fake News - Sakshi

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్‌ వెళ్లొచ్చారు... ఒకవైపు కన్నడ నాట  హోరాహోరీ ఎన్నికల ప్రచారం సాగుతోంది.  ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదు ‘హంగ్‌ అసెంబ్లీ’ ఏర్పడవచ్చునని ఊహాగానాలు ఊపందుకుని నువ్వా నేనా అన్న ఉత్కంఠ పరిస్థితుల్లోనూ సిద్ధరామయ్య పాకిస్తాన్‌కు ఎందుకెళ్లారని అనుకుంటున్నారా ? ఇదో ఫేక్‌ న్యూస్‌...!  ప్రచార వేడి రాజుకుంటున్న ప్రస్తుత దశలో ఈ నకిలీవార్త అక్కడి వాట్సాప్, ట్విటర్‌ ఇతర సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. తాజా బయటపడిన ఈ వార్తే కాదు మరెన్నో ఫేక్‌న్యూస్‌లు ముంచెత్తుతున్నాయి. సిద్ధరామయ్య పాక్‌ పర్యటన వార్తను నమ్మించేందుకు ఏకంగా ఓ న కిలీ లెటర్‌ను కూడా సృష్టించారు.  గత నెల 13న సాయంత్రం 5 గంటలకు  ప్రయాణీకులు ఎవరూ లేకుండా ఒక విమానం ముంబై నుంచి బయలుదేరి 6.15కు కరాచీకి చేరుకుంది. కరాచీ నుంచి రాత్రి 7 గంటలకు  సిద్ధరామయ్య (ఎస్‌ అనే ఇంటిపేరు లేకుండా) జమీర్‌ అహ్మద్‌  అనే ఇద్దరు వ్యక్తులతో ఆ విమానం రాత్రి 9.10 నిముషాలకు ఢిల్లీకి చేరుకుంది. అదేరోజు రాత్రి 11.45 నిముషాలకు ఢిల్లీలో బయలుదేరి తెల్లవారుజామున (14న) 2 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. విమాన ప్రయాణ అనుమతికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌  ఏటీసీని ఉద్ధేశించిన రాసినట్టుగా చెబుతున్న నకిలీ లేఖ సారాంశమిదీ...

ఎందుకీ ప్రచారం..
ఎన్నికల నేపథ్యంలో  పాకిస్థాన్‌ నుంచి డబ్బు రవాణా చేసేందుకు సిద్ధరామయ్య అక్కడకు వెళ్లినట్టుగా ప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియాలో విస్తృతంగా  ఫేక్‌న్యూస్‌ వ్యాపింపజేశారు. ఎన్నికల్లో పంపిణీ కోసం నకిలీ కరెన్సీ, అందుకోసం తీవ్రవాదులతో ఒప్పందం ? ... బ్రేకింగ్‌న్యూస్‌ అంటూ ఈ వార్తను ప్రచారం చేశారు. దీనికి సమాధానంగా మళ్లీ జాతి వ్యతిరేక సీఎం, దీనికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి అంటూ యెడ్యూరప్ప, అనంతకుమార్‌ హెగ్డే, తదితరులు నిలదీసినట్టు...దేవుడిని దర్శించుకునేందుకు సిద్ధరామయ్య కరాచీకి వెళ్లారా ? లేక కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు నకిలీ కరెన్సీ రూపంలో పాకిస్తాన్‌ సహాయం కోసం వెళ్లారా ? అంటూ సోషల్‌మీడియాలో ప్రచారాన్ని వేడెక్కించారు.

అది ఫేక్‌ లెటరే...
తమ అకాడమి లెటర్‌హెడ్‌పై ఈ ఫేక్‌లెటర్‌ను ముద్రించినట్టు న్యూఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్‌ ఎవియేషన్‌  సంస్థ స్పష్టం చేసింది. ఈ లేఖ నకిలీదేనని కర్ణాటక సీఎం కార్యాలయం కూడా కొట్టిపారేసింది. సిద్ధరామయ్య కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చారని చెబుతున్న ఏప్రిల్‌ 13న ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రకియకు సంబంధించిన సమావేశంలో ఢిల్లీలోనే ఉన్నారని పేర్కొంది. ఏప్రిల్‌ 14 తెల్లవారు 2 గంటలకు సిద్ధరామయ్య బెంగళూరుకు ఆ నకిలీ లేఖలో పేర్కొనగా, ఆ రోజు ఢిల్లీలోని కర్ణాటకభవన్‌లో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దీనిపై   కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బ్రిజేష్‌ కాలప్ప స్పందిస్తూ... బీజేపీ మురికి రాజకీయాలకు పాల్పడుతోందని. ట్విటర్‌ వేదికపై జరిగిన ఈ దుష్ప్రచారంపై రాష్ట్ర సీఐడీ విభాగం వెంటనే విచారణ జరిపించాలంటూ  డిమాండ్‌చేశారు. 

మరికొన్ని ఫేక్‌న్యూస్‌...
చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సిద్ధరామయ్య ప్రకటించగానే  వొక్కళిక ఓటర్ల మద్దతు జేడీ(ఎస్‌) జీటీ  దేవెగౌడకే ఉన్నందున అక్కడి నుంచి నిలబడితే ఆయన ఓడిపోతారంటూ ఓ ఫేక్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ స్థానానికి బదులు వరుణ, బసవకళ్యాణ్, గంగావతి, శాంతినగర్‌లలో ఒక సీటును ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలంటూ కూడా ఈ నివేదికలో సూచించారు. ఆ రాష్ట్రంలో ఎక్కువమటుకు ఇంటెలిజెన్స్‌ నివేదికలు ఇంగ్లిష్‌లో కాకుండా కన్నడంలోనే ఉంటాయి. ఈ నకిలీ నివేదికపై ఏడీజీపీ సంతకం ఉండగా, ప్రస్తుతం అక్కడ ఆ పోస్ట్‌లో ఎవరూ నియమితులు కాలేదు. ఈ అంశాలన్నీ అది ఫేక్‌న్యూస్‌ అని స్పష్టంచేశాయి.  ఎన్నికల నేపథ్యంలో  ఇదే అభ్యర్థుల జాబితా అంటూ మరో నకిలీ ఇంటెలిజెన్స్‌ నివేదిక కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. 
కర్ణాటకలో కాదు సామాజిక మాధ్యమాల ద్వారా  ఫేక్‌న్యూస్‌ ఎక్కడైనా వేగంగా వ్యాప్తి చెందవచ్చునని, అందువల్ల ఇలాంటి తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించేందుకు ఈ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఏం చేయాలి ?


  • ముందు సోషల్‌ మీడియాలో వచ్చిన వార్త యధార్థమైనదా కాదా అని ప్రశ్నించుకోవాలి.

  • వాట్సాప్‌లో లేదా మీ మెయిల్‌లోని ఇన్‌బాక్స్‌లో ఏది వచ్చినా దానిని వెంటనే నమ్మేయకండి
     

  • దానికి ఎంత విశ్వనీయత ఉందనే దానిని ఇతర వార్తాసంస్థల ద్వారా సరిచూసుకోండి.

  • ఇలాంటి వార్త ఒకేచోట వచ్చిందా లేక పలు వెబ్‌సైట్లు, వార్తాసంస్థల్లో వచ్చాయా అన్నది చెక్‌ చేసుకోవాలి. 

  • అసలు ఈ వార్త జరిగిందా లేదా చోటు చేసుకుందా అన్నది తెలుసుకోవాలి.
  • ఈ వార్త నకిలీది అని మీరు తెలుసుకుంటే, మళ్లీ వాట్సాప్‌ లేదా ట్విటర్‌ ద్వారానే అది ఫేక్‌ న్యూస్‌ అని విస్తృతంగా షేర్‌చేయాలి.

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement