సుప్రీంకు చేరిన కర్ణాటకం | Sakshi
Sakshi News home page

సుప్రీంకు చేరిన కర్ణాటకం

Published Thu, Jul 11 2019 2:51 AM

Karnataka Rebel MLAs move Supreme Court against Speaker decision - Sakshi

న్యూఢిల్లీ: శాసనసభ స్పీకర్‌ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ గురువారం అత్యవసర విచారణకు వచ్చేలా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు.

తమ రాజీనామాల విషయంలో స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కావాలనే తమ రాజీనామాలను ఆమోదించడం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పిటిషన్‌లో ఆరోపించారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని వారు ధర్మాసనాన్ని కోరారు. అంతేకాకుండా తమను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్‌ను నిరోధించాలని కూడా వారు కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ స్పీకర్‌కు పిటిషన్‌ సమర్పించిందని వారు పేర్కొన్నారు. తమను అనర్హులుగా ప్రకటించడం పూర్తిగా చట్టవిరుద్దమన్నారు.

రాజ్యసభలో రభస
కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభలో వరసగా రెండో రోజు బుధవారం కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.భోజన విరామం తర్వాత బడ్జెట్‌పై చర్చ మొదలవగానే కాంగ్రెస్‌ ఎంపీలు సభ మధ్యకు దూసుకొచ్చి నినాదాలు చేశారు. చర్చను ప్రారంభించాల్సిన కాంగ్రెస్‌ నేత చిదంబరం ఈ గొడవ కారణంగా మాట్లాడలేకపోయారు. గందరగోళం మధ్య  చర్చించలేమంటూ సమాజ్‌వాదీ ఎంపీలు వాకౌట్‌ చేశారు. గందరగోళం కారణంగా సభ మూడు సార్లు వాయిదా పడింది. తర్వాత అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకుని గురువారం బడ్జెట్‌పై చర్చను కొనసాగించాలని నిర్ణయించారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఉపాధ్యక్షుడు హరివంశ్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement