ఊహకందని కర్ణాటక ఓటర్ల నాడి | Sakshi
Sakshi News home page

ఒక రాష్ట్రం.. అనేక ప్రపంచాలు..!

Published Mon, Apr 30 2018 2:57 AM

Karnataka Voters Nerve Was Not Predictable - Sakshi

దక్షిణాదికి రాజమార్గమని భారతీయ జనతా పార్టీ..  ఐదేళ్ల పాలనకు ఇంకోసారి పొడిగింపు కావాలని కాంగ్రెస్‌.. చేజారిన అధికారాన్ని కింగ్‌మేకర్‌ రూపంలోనైనా సాధించాలని జేడీఎస్‌.. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం ఇదీ..! పోలింగ్‌ రోజు (మే12) సమీపించేకొద్దీ.. పోరు ఉత్కంఠభరితమవుతూండగా ఓటరు నాడి పట్టడం మాత్రం ఎవరి తరమూ కావడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఎన్నికలు.. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ నినాదం ‘ఒకరాష్ట్రం.. అనేక ప్రపంచాలు’ అనే చందంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆరు భిన్న ప్రపంచాలైన కర్ణాటకలో ఏ పార్టీ అదృష్టం ఎలా ఉందో? 

బ్రిటిష్‌ పాలనా కాలంలో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌ నిజాం పాలనలోని కన్నడ ప్రాంతాలు, కొడగు, పాత మైసూరు ప్రాంతాలను కలిపి కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తాన్ని బొంబాయి, కోస్తా, హైదరాబాద్, పాత మైసూరు, మధ్య కర్ణాటక, బెంగళూరు అర్బన్‌ అనే ఆరు ప్రాంతాలుగా విభజించి చూడటం ఆనవాయితీ. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో సీట్లవారీగా చూస్తే పాత మైసూరు, బొంబాయి కర్ణాటక పెద్ద ప్రాంతాలు. 

కోస్తాలో బీజేపీ ఆధిక్యం నిలిచేనా? 
కర్ణాటక సముద్ర తీర ప్రాంతాన్ని కరావళి అంటారు. ఉడుపి, ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం 30 ఏళ్లుగా హిందుత్వ ప్రయోగశాలగా మారిందన్నది విశ్లేషకుల అంచనా. హిందూ, ముస్లిం, క్రైస్తవ జనాభా దాదాపు సమానంగా ఉన్న కరావళిలో మత ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎక్కువే. ఫలితంగా కాషాయ పక్షం వేగంగా వేళ్లూనుకుంది. ఈ కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఘనవిజయం సాధించింది.   పార్టీ నుండి వేరుపడిన యడ్యూరప్ప, శ్రీరాములు వంటివారిప్పుడు మళ్లీ పార్టీలో చేరిపోవడంతో ఈ ప్రాంతంలో మళ్లీ  ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనుకుంటోంది. 

బొంబాయి కర్ణాటకలో గెలుపెవరిది? 
లింగాయతుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బొంబాయి కర్ణాటక ప్రాంతంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు సొంత కుంపటి పెట్టుకోవడంతో నష్టపోయింది. మొత్తం 50 స్థానాలున్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 31 స్థానాలు సాధించగా బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈసారి అంతేస్థాయిలో సీట్లు గెలుపొందేందుకు కాంగ్రెస్‌ లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్‌కు ఓకే చెప్పింది. అయితే లింగాయతుల్లోని ఒకవర్గం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఆర్థిక వెనుకబాటు, కరువు, రైతు ఆత్మహత్యలు, మహాదాయి నదీ జలాల వివాదం, నిరుద్యోగం, చెరకు ధర వంటివి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలని అంచనా.  

హైదరాబాద్‌ కర్ణాటక పయనం ఎటు? 
రాష్ట్రంలో మరో వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్‌ కర్ణాటక. కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఆశలు కల్పిస్తున్న ప్రాంతమిదే. 2012లో యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రాజ్యాంగంలోని 371–జే ద్వారా ప్రత్యేక హోదా కల్పించడం దీనికి కారణం.  దీంతో గతంకంటే తాము మెరుగైన స్థితిలో ఉంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్‌కు 23, బీజేపీకి ఐదు సీట్లు దక్కాయి. జేడీఎస్‌కు ఐదు సీట్లు లభించాయి. 

మధ్య కర్ణాటక మొగ్గు ఎటు? 
చిత్రదుర్గ, దావణగెరె, చికమగళూరు, శివమొగ్గ జిల్లాలున్న మధ్య కర్ణాటకలో లింగాయతుల ప్రభావం కూడా ఉంది. 2008లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప సొంత జిల్లా శివమొగ్గతో కూడిన మధ్య కర్ణాటక కీలకపాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 13 సీట్లు దక్కించుకున్నాయి. లింగాయతులకు ప్రత్యేక గుర్తింపు ప్రభావం ఎంతన్నది స్పష్టంగా తెలియడంలేదు. 

జేడీఎస్‌ అడ్డా.. పాత మైసూరు! 
పూర్వపు మైసూరు సంస్థానమైన ఈ ప్రాంతంలో మైసూరు, కొడగు, మండ్య, హాసన్, చామరాజనగర, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ తదితర జిల్లాలున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, అతడి సామాజిక వర్గమైన ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. పోరు ప్రధానంగా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్యే. ఇక్కడ బీజేపీకి బలం అంతంతే. మొత్తం 61 స్థానాలకుగానూ 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 27, జేడీఎస్‌ 25 సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. మాజీ సీఎం కుమారస్వామి సహా దేవెగౌడ కుటుంబ సభ్యులు జేడీఎస్‌ తరఫున ఈ ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నారు. ఒక్కళిగ వర్గానికి చెందిన మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ట కాంగ్రెస్‌ నుంచి తమ పార్టీలోకి చేరడంతో ఈసారి జేడీఎస్‌ ప్రభావాన్ని తగ్గించగలమని బీజేపీ భావిస్తోంది. ఇదే ప్రాంతంలోని చాముండేశ్వరి స్థానం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు.  

బీజేపీకి బలం.. బెంగళూరు అర్బన్‌ 
రాష్ట్ర రాజధాని బెంగళూరు కొన్నేళ్లుగా బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది. అందుకే అవినీతి ఆరోపణలు, పరిపాలన లోపాలు వంటి అనేక అననుకూల పరిస్థితుల్లో కూడా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 28 సీట్లకుగానూ 12 స్థానాలు సాధించగలిగింది. కాంగ్రెస్‌ 13 సీట్లు కైవసం చేసుకుంది. హిందీ వ్యతిరేకత, కన్నడ ఆత్మగౌరవం వంటి ప్రచారాంశాలతో మంచి ఫలితాలు సాధించడానికి సిద్దరామయ్య కృషి చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement