టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు

Published Sun, Jan 28 2018 3:02 AM

karne prabhakar about srinivas murder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని టీఆర్‌ఎస్‌కు ఆపాదించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలసి కర్నె శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం, చివరకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ నేతలు కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

హతుడు శ్రీనివాస్, నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచర బృందంలోని వారేనన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్‌ తదితరులు నల్లగొండకు వెళ్లి శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నె విమర్శించారు. శ్రీనివాస్‌ హత్యపై న్యాయ విచారణ జరగాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ పక్షాన కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే వీరేశం ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌కాల్స్‌ జాబితాను కూడా బయట పెట్టాల్సిందిగా కోరాలన్నారు.

ఫొటోలే విచారణకు ప్రామాణికమైతే నిందితులంతా కోమటిరెడ్డితో ఫొటోలు దిగారని, ప్రెస్‌మీట్‌లో ఆ ఫోటోలను విడుదల చేశారు. ఎమ్మెల్యే వీరేశంతో నిందితులు దిగిన ఫొటో ఆయన పీజీ పరీక్ష రాసేందుకు వచ్చినప్పుడు కాలేజీ వద్ద దిగినదని, యువ శాసన సభ్యుడు కాబట్టి వీరేశంతో వారు ఫొటోలు దిగారన్నారు. కాంగ్రెస్‌కు హత్యా రాజకీయాలు మొదట్నుంచీ అలవాటేనని, టీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలకు వ్యతిరేకమని కర్నె పేర్కొన్నారు. 

Advertisement
Advertisement