కేసీఆర్‌..కేటీఆర్‌ జోర్దార్‌ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌..కేటీఆర్‌ జోర్దార్‌

Published Tue, Apr 9 2019 7:14 AM

KCR And KTR Campaign in Hyderabad - Sakshi

తండ్రీకొడుకులు ప్రచారం హోరెత్తించారు. వికారాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌... కూకట్‌పల్లి పరిధిలో నిర్వహించిన రోడ్‌ షోలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొని గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. 

మూసాపేట: ‘ఇవి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. బీజేపీకి ఓటేస్తే ప్రధాని మోదీకి, కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి లాభం చేకూరుతుంది. కానీ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణకు లాభమని’ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మూసాపేట్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద మాట్లాడారు. ‘మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే గల్లీలో ప్రజా సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్‌ సైనికుడిగా పని చేస్తారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆయనను గెలిపించాలని’ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదు. మాటలు తప్ప చేతల్లేవ్‌. 5కోట్ల ఉద్యోగాలు కాదు కదా.. కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రతి పేదవాడి అకౌంట్‌లో రూ.15లక్షలు వేస్తానన్నారు. ఇప్పటికీ ఏ ఒక్కరికీ డబ్బులు రాలేదు. ఎల్బీ స్టేడియానికి వచ్చిన ప్రధాని తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా... కేసీఆర్‌ యాగాలు, హోమాలపై విమర్శించడం ఎందుకు? మేం యాగాలు, హోమాలు చేస్తే మీకేం బాధ. కేసీఆర్‌కు అన్ని రోజులూ దేవుడిపై భక్తి ఉంటుంది. కానీ మోదీకి కేవలం ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే గుర్తుకొస్తాడు. ఓట్ల కోసం మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే వారిని నమ్మొద్దని’ అన్నారు. 

ఇన్నేళ్లు అన్యాయమేనా?  
‘కాంగ్రెసోళ్లు ఇక నుంచి అన్యాయం ఉండదని అంటున్నారు. అంటే ఇన్నేళ్లు తాత, ముత్తాతలు ఏలినప్పుడు అన్యాయం ఉందా? కొడంగల్‌లో చెల్లని రూపాయి మూసాపేటలో చెల్లుతుందా? సొంత ఊరిలో పనికి రాడని తిరస్కరిస్తే మనం ఎంపీగా ఆమోదిద్దామా?. అమ్మకు అన్నం పెట్టనివాడు, చిన్నమ్మకు బంగారు గాజులు కొనిచ్చాడంటా...’ అని కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ‘కేంద్రంలో బలం ఉంటేనే మాట వింటారు. ఏ రాష్ట్రానికి చెందిన రైల్వే మంత్రి ఉంటే అక్కడికే రైలు వెళ్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు రావు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో మన ఎంపీలే కీలకమవుతారు. 16 ఎంపీలను సీట్లు గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ ఢిల్లీని శాసిస్తారు. కావాల్సినన్ని నిధులు తీసుకొస్తారు. వారం రోజులు ఇక్కడే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. కేపీహెచ్‌బీలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం. రిజిస్ట్రేషన్‌ సమస్య పరిష్కరిస్తాం. లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 9 నెలల్లో ఇస్తాం. కాముని, మైసమ్మ చెరువుల శుద్ధీకరణకు సెంటర్‌ ఏర్పాటు చేస్తామ’ని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రోడ్‌ షోలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మూసాపేట డివిజన్‌ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement