‘గాచారం బాగాలేక చంద్రబాబుతో కలిసి పనిచేశా’ | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 2 2018 4:09 PM

KCR Speech At Nagar Kurnool Praja Ashirvada Sabha - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూలు/చేవెళ్ల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజా సమస్యలపై నిబద్ధత లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. తాను కొంత కాలం చంద్రబాబుతో కలిసి పనిచేశానని అన్నారు. గాచారం బాగాలేకపోవడం వల్లే ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌తో జట్టు కట్టిన చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ ఆ పార్టీనే ఓడించమని అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని నాటి సీఎం కిరణ్‌ చెప్పారని గుర్తుచేశారు. కానీ నేడు తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌ అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పరిణతి ఉంటే ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని ఆయన అన్నారు. దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజాకూటమి, టీఆర్‌ఎస్‌ చరిత్ర ప్రజలకు తెలుసనని వ్యాఖ్యానించారు.

నాగర్‌ కర్నూలు వాసులపై హామీల వర్షం
అంతకు ముందు నాగర్‌ కర్నూలు సభలో కేసీఆర్‌ జిల్లా వాసులపై హామీల వర్షం కురిపించారు. నాగర్‌ కర్నూలులో మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపిస్తే ఏడాదిలోగా వట్టెం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. నాగర్ కర్నూల్ ని బంగారు నాగర్ కర్నూల్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలపై కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 5 లక్షల రూపాయల రుణం ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతుందని.. ఇలా చేయడం అంటే ప్రజలపై మళ్లీ భారం మోపడమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలపై ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు పథకం ఓ అద్భుతమైన కార్యక్రమమని తెలిపారు. త్వరలోనే ఈఎన్‌టీ స్పెషలిస్టులు కూడా గ్రామాలకు వస్తారని హామీ ఇచ్చారు. ఆరోగ్య తెలంగాణ స్పష్టించడమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, టీడీపీ హయంలో జరిగిన గృహ నిర్మాణాలు డబ్బా ఇళ్లేనని ఆరోపించారు. కొద్దిగా ఆలస్యమైనా ప్రజలకు మంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరం అని పేర్కొన్నారు.

24 గంటలు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారు
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తనేనంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 24 గంటల పాటు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో కరెంట్‌ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాగా, టీఆర్‌ఎస్‌ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే సభలో కేసీఆర్ విడుదల చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement