పోలింగ్‌ పెరగాలి: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 7 2018 1:32 AM

KCR Suggestions To TRS MLA Candidates Over Polling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేలా చర్యలు తీసు కోవాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదేశించారు. నియోజక వర్గాల్లో ఎక్కువ మంది ఓటు వేసేలా పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమన్వయం చేసు కోవాలని సూచించారు. ఓటింగ్‌ శాతం పెరి గితే టీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు పెరుగు తాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోలింగ్‌ ముందు రోజు సరళిపై సేకరించిన సమాచారాన్ని పరిశీలించారు. ఈ నివేదికల ఆధారంగా అభ్యర్థులకు సూచనలు చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా ఓటింగ్‌లో పాల్గొనేలా గ్రామస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఓటింగ్‌లో పాల్గొంటే గెలుపు సునాయాసం అవుతుందని చెప్పారు. పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే టీఆర్‌ఎస్‌కు అంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందరు అభ్యర్థులు పోలింగ్‌ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ద్వితీయశ్రేణి నేతల నుంచి వచ్చే సమాచారంపై ఎప్పటికప్పడు స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో పోలింగ్‌ ఊహించినట్లుగానే ఉంటుందని... పట్టణాలు, నగరాల్లో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రయత్నించేలా అభ్యర్థులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రచారం పూర్తి చేసిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. కాగా పోలింగ్‌ పరిస్థితులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. అభ్యర్థులతో ఈ బృందం ఎప్పటికప్పుడు సమన్వయం చేయనుంది.

   

Advertisement
Advertisement